కుత్బుల్లాపూర్ ( న్యూస్ విధాత్రి ), సెప్టెంబర్ 7 : శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధి చెరుకుపల్లి కాలనీ రామాలయం వద్ద శ్రీ వంశీ కృష్ణ యూత్ , పాపయ్య యాదవ్ నగర్ గోకుల యాదవ్ సంఘం వారి ఆధ్వర్యంలో వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు స్థానిక ఎమ్మెల్యే కె.పి వివేకానంద్ , మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత సింహారెడ్డి వేరువేరుగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా శ్రీ వంశీకృష్ణ యూత్, పాపయ్య యాదవ్ నగర్ గోకుల సంఘం ఆధ్వర్యంలో జన్మాష్టమి వేడుకలు నిర్విఘ్నంగా నిర్వహించడం సంతోషించ దగ్గ విషయం అన్నారు. కృష్ణ భగవానుని దివ్య ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. చిన్నారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, సంప్రదాయ నృత్యాలు, మహిళల కోలాటం భక్తులను ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు కేఎం గౌరీష్, బొడ్డు వెంకటేశ్వర రావు, నియోజకవర్గ బీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు సోమేష్ యాదవ్, బీఆర్ఎస్, బిజెపి నాయకులు, యాదవ సంఘాల నాయకులు, స్థానిక కాలనీ వాసులు, భక్తులు పాల్గొన్నారు.