ముగ్గురు ద్విచక్ర వాహనాల చోరులు అరెస్ట్… రిమాండ్ కు తరలింపు
~ 14 ఫిర్యాదులు…20 ద్విచక్ర వాహనాలు
~ ఇళ్ళ ముందు పార్క్ చేసిన ఖరీదైన ద్విచక్ర వాహనాలే లక్ష్యం
~ వాహనాల తనిఖీల్లో పట్టుబడ్డ నిందితులు
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), మే 31 : ద్విచక్ర వాహనాల వరుస చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను పేట్ బషీరాబాద్ పోలీసులు అరెస్టు చేసి శుక్రవారం రిమాండ్ కు తరలించారు. ఈ మేరకు పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసిపి రాములు కేసు వివరాలను వెల్లడించారు.
కామారెడ్డి జిల్లా చెందిన బక్కోల నవీన్ గౌడ్ (34) ఉప్పల్ లో నివాసం ఉంటూ ఆటో మెకానిక్ గా పనిచేస్తున్నాడు. కామారెడ్డికి చెందిన పల్లికొండ దేవరాజ్ (32) పెయింటర్ పని చేస్తున్నాడు. ఇనుగుర్తి ప్రశాంత్ (19) విద్యార్థి. వీరు ముగ్గురు ఒక బృందంగా ఏర్పడి ఇళ్ళ ముందు పార్క్ చేసిన ఖరీదైన ద్విచక్ర వాహనాలను దొంగిలించి వాటిని అమ్మి ఆర్థిక అవసరాలు తీర్చుకుంటున్నారు. ఈ క్రమంలో నిందితులు సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ లతోపాటు సంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో 20 ద్విచక్ర వాహనాలను దొంగిలించారు. వీటిలో పెట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలో 2 ద్విచక్ర వాహనాలు, ఉప్పల్ పిఎస్ పరిధిలో 5, మేడ్చల్ పిఎస్ పరిధిలో 3, కుషాయిగూడ పీఎస్ పరిధిలో ఒకటి, గుమ్మడిదల పిఎస్ పరిధిలో 2, సూరారం పీఎస్ పరిధిలో ఒకటి తో కలిపి మొత్తం 14 కేసులు నమోదయ్యాయి. అలాగే ఎటువంటి ఫిర్యాదులు అందని మరో 6 ద్విచక్ర వాహనాలు కూడా ఉన్నాయి.
పేట్ బషీరాబాద్ పిఎస్ పరిధిలో వాహనాల తనిఖీల్లో భాగంగా అనుమానాస్పదంగా కనిపించిన ఈ ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా వాహనాల చోరీ విషయం బయట పడింది. అనంతరం నిందితుల నుంచి 20 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పేట్ బషీరాబాద్ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో జరిగిన సీఐ విజయ వర్ధన్, డి ఎ నరసింహారాజు, డి ఎస్ ఐ నరసింహులు, క్రైమ్ సిబ్బంది పాల్గొన్నారు.