~ రాష్ట్ర ప్రభుత్వ హామీల కోసం పోరాడడం….
~ కేంద్రం నుంచి నిధులు తేవడమే లక్ష్యం
~ నేనూ స్థానికుడినే…నాకు స్థానిక సమస్యలు తెలుసు
~ దశాబ్ది సుభిక్ష పాలనకు దేశంలో బీజేపీ విజయమే నిదర్శనం
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జూన్ 4 : కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ కూడా తనకు ఓట్లు వేసిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు బీజేపీ మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్. ఓట్ల లెక్కింపులో ఇంకా పలు రౌండ్లు మిగిలి ఉన్నా ఆయన విజయం దాదాపు ఖరారు కావడంతో కీసరలోని హోళీ మేరీ కళాశాలలోని కౌంటింగ్ కేంద్రం వద్ద మీడియాతో మంగళవారం ఈటల ప్రసంగించారు. తనను నమ్మి బీజేపీకి ఓటు వేసిన ప్రతీ ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
తనపై పెట్టిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని హామీ ఇచ్చారు. ఈ గెలుపుతో తనకు రెండు ప్రధాన కర్తవ్యాలు ఉన్నాయని, అందులో ఒకటి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల కోసం పోరాడడం కాగా, మోదీ నాయకత్వంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు తేవడం రెండవదిగా తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్రంలోని 17 పార్లమెంటు స్థానాల్లో 8 స్థానాల్లో విజయంతో ఎంఐఎం మినహా రాష్ట్ర ప్రభుత్వంతో సమానంగా ఆధిపత్యం కొనసాగిస్తున్నామన్నారు. కేంద్రంలో మరోసారి మోదీ ప్రభుత్వం కొలువు తీరేలా దేశంలో సుమారు 300 పైచిలుకు స్థానాల్లో అధికారంలోకి రాబోతున్నామన్నారు. తాను కూడా స్థానికుడినే అని తనకు కూడా స్థానికంగా ఉన్న కంటోన్మెంట్ రహదారులు, చెరువుల పునరుద్ధరణ, యువతకు ఉపాధి, పేదలకు ఇళ్లు, ఇండస్ట్రీయల్ కారిడార్ వంటి సమస్యలు తెలుసని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని, తన గెలుపుకు సహకరించిన అన్ని సామాజిక వర్గాలు, సంఘాల వారికి ధన్యవాదాలు తెలిపారు. పది సంవత్సరాల అనంతరం కూడా దేశ ప్రజలు మోదీ పాలనను కోరుకుంటున్నారంటే అది వారి పాలన దక్షతకు నిదర్శనమని కొనియాడారు.