షాపూర్ నగర్ శ్రీ శ్రీ శ్రీ నల్ల పోచమ్మ దేవాలయంలో అర్ధరాత్రి చోరీ
~ హుండీ లో రూ. 50వేల నగదు ఉండొచ్చని అంచనా
గాజులరామారం ( న్యూస్ విధాత్రి), జూలై 6 : షాపూర్ నగర్ ఈఎస్ఐ ఆసుపత్రి పక్కన ఉన్న శ్రీ శ్రీ శ్రీ నల్ల పోచమ్మ దేవాలయంలో శుక్రవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. వివరాల ప్రకారం… శుక్రవారం రాత్రి సుమారు 1.15 గంటలకు ఓ వ్యక్తి ముఖానికి గుడ్డకట్టుకొని దేవాలయ గేటు తాళాలను పగలగొట్టి హుండీని కొల్లగొట్టాడు.
ఈ దృశ్యాలన్నీ అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. శనివారం ఉదయం గుడి తెరిచేందుకు వెళ్లగా అక్కడ తాళాలు పగలగొట్టి ప్రాంతమంతా చల్లాచదురుగా ఉండడంతో నిర్వాహకులు జీడిమెట్ల పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటన స్థలికి చేరుకున్న పోలీసులు ఆలయ నిర్వాహకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అయితే గత ఆరు నెలల నుంచి హుండీని లెక్కించలేదని, అందులో సుమారు రూ. 50 వేల వరకు నగదు ఉంటుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు.