దుండిగల్ లో ఓ వ్యక్తి అనుమానాస్పద మృతి
~ ఆత్మహత్య చేసుకున్నాడా..? హత్య చేశారా..?
~ ఆర్థిక లావాదేవీలే కారణంగా అనుమానం
దుండిగల్ (న్యూస్ విధాత్రి), జూలై 11: ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం… దుండిగల్ తాండా-1 కు చెందిన బానోతు మోహన్ నాయక్, అనిత భార్యాభర్తలు వారికి ఇద్దరు కుమారులు బానోతు పవన కళ్యాణ్(24), సిద్దు నాయక్, కూతురు స్వాతి ఉన్నారు. తండ్రి నాలుగు సంవత్సరాల క్రితం చనిపోయాడు. అప్పటి నుండి తాండాలో ఉన్న కుటుంబం 4 నెలల క్రితం డి.పోచంపల్లి పరిది సారిగూడెంలో అద్దెకు ఉంటున్నారు. వారికి దుండిగల్ తాండా లో సర్వే నంబర్ 148,150 లోని 14 గుంటలు, సర్వే నంబర్.158 లోని 17 గుంటలు సొంత భూమి విషయంలో వివాదం నడుస్తున్నట్లు సమాచారం. దీని విషయంలో గత రాత్రి నలుగురు వ్యక్తులు స్థానికంగా ఉండే కల్లు కాంపౌండ్ దగ్గరకు పిలిచి గొడవకు దిగినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో గురువారం ఉదయం పవన్ కళ్యాణ్ తాను అద్దెకు ఉంటున్న ఇంట్లో విగత జీవిగా పడి ఉండడం పలు అనుమానాలకు తావిస్తుంది. డబ్బుల విషయంలోనే తమ్ముడు సిద్దు నాయక్ కు మృతుడు పవన్ కళ్యాణ్ కు గొడవ జరిగినట్లు స్థానికులు తెలిపారు. పవన్ కళ్యాణ్ తలకు బలమైన గాయాలు కావడంతో మృతి చెందినట్లు తెలుస్తుంది. దీంతో పలు అనుమానాలకు తావిస్తూ సారె గూడెం లోని ఇంటివద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. పవన్ కళ్యాణ్ ను హత్య చేశారా…? ఆత్మహత్య చేసుకున్నాడా…? అనే అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి. ఈ మేరకు సమాచారం అందుకున్న దుండిగల్ పోలీస్ లు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ మార్చరీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని, తాము అక్కడికి వెళ్లేలోపే తాడును కట్ చేసి ఉంచారని, పోస్టుమార్టం రిపోర్టర్ అనంతరం పూర్తి వివరాలు తెలుస్తాయని దుండిగల్ సీఐ శంకరయ్య తెలిపారు.