~ కాలనీ సంక్షేమ సంఘ నిధి దుర్వినియోగంపై…
~ రూ. 8 లక్షలు సొంత ఖాతాల్లో జమ చేసుకున్నారని ఆరోపణ
~ ప్రశ్నించిన వారిని బెదిరిస్తున్నారని పోలీసులకు వెల్లడి
~ అధ్యక్షుడు శివప్రసాద్ కోశాధికారి రంజిత్ పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు
నిజాంపేట (న్యూస్ విధాత్రి), జూలై 27 : బాచుపల్లిలోని కౌసల్య కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శివప్రసాద్, కోశాధికారి రంజిత్ కాలనీ సంక్షేమ నిధి దుర్వినియోగానికి పాల్పడ్డారని బాచుపల్లి పోలీసులకి కాలనీవాసులు శనివారం ఫిర్యాదు చేశారు. కౌసల్య కాలనీ శ్రీ దుర్గా ఆశీర్వాద్ అపార్ట్ మెంట్ కు చెందిన సోమశేఖర్ భార్య మల్యాల రమణి (39) కాలనీ అధ్యక్ష, కోశాధికారి గత మూడు సంవత్సరాలుగా బాధ్యతలు నిర్వహిస్తూ కాలనీ అభివృద్ధి కోసం వసూలు చేసిన సంక్షేమ సంఘ నిధి విషయంలో అవకతవకలకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వసూలైన సుమారు రూ. 40 లక్షల నిధులకు ఎటువంటి సరైన లెక్క పత్రం లేకుండా అందులో సుమారు రూ. 8 లక్షల తమ సొంత ఖాతాల్లో జమ చేసుకున్నారని, వాటికి కూడా లెక్కలు చెప్పకుండా కాలనీ వాసులను మభ్యపెడుతూ వారి సొంత సొమ్ములా చెలామణి అవుతున్నారని తెలిపారు. కాలనీ సంక్షేమ సంఘానికి సంబంధించిన ఎన్నికల విషయం, సంక్షేమ నిధి విషయంలో పరోక్షంగా, కాలనీ వాట్స్ అప్ గ్రూపుల్లో ప్రశ్నిస్తే తనను, ప్రశ్నించిన కాలనీ వాసులను బెదిరించడంతో పాటు ఆయా గ్రూపులో తమను అవమానించే విధంగా పోస్టులు పెడుతూ గ్రూపుల నుంచి తొలగిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సంక్షేమ సంఘం రిజిస్ట్రేషన్ నిబంధనల ప్రకారం ప్రతి రెండేళ్లకు ఒకసారి పూర్తిస్థాయిలో రాబడి, ఖర్చుల వివరాలను తెలియపరుస్తూ జిల్లా రిజిస్టర్ కు సమర్పించాల్సిన నివేదికలను కూడా సమర్పించకుండా వారి ఇష్టానుసారం సంక్షేమ నిధిని వాడుకుంటున్నారని అన్నారు. ప్రశ్నించిన వారిని బెదిరించడమే కాకుండా రూ. 8 లక్షల కాలనీ సంక్షేమ నిధి దుర్వినియోగానికి పాల్పడిన అధ్యక్షుడు, కోశాధికారిపై చట్టరీత్యా చర్యలు తీసుకొని కాలనీ వాసులకు న్యాయం చేయాలని ఫిర్యాదులో రమణి కోరారు. ఫిర్యాదు అందించిన వారిలో కొల్లి సత్యనారాయణ, గంగారెడ్డి, బాలగంగాధర్, గొల్ల కృష్ణ, సంతోష్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, ప్రవీణ్ కుమార్, లింగారెడ్డి ఉన్నారు.