నకిలీ విలేఖరి ధర్మపురి… దాదాగిరి…

• ప్రముఖ టీవీ ఛానళ్లలో విలేకరినంటూ ప్రజలకు బెదిరింపులు
• ఓ రోడ్డు ప్రమాదం విషయంలో అక్రమ వసూలు చేసేందుకు పన్నాగం…
•బెడిసి కొట్టిన ప్రయత్నం
• నకిలీని పట్టుకొని పోలీసులకు అప్పగించిన అసలు
• రోడ్డు ప్రమాద కేసు విషయంలో పోలీసుల నిర్లక్ష్యం
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), అక్టోబర్ 18 :  క్షవరం దుకాణంలో పని చేసే వ్యక్తి ప్రముఖ టీవీ ఛానళ్లలో విలేకరినంటూ చలామణి అవుతూ ప్రజలకు క్షవరం చేయడానికి సిద్ధమయ్యాడు ఓ ప్రబుద్ధుడు. నకిలీ విలేఖరి అవతారం ఎత్తి ప్రజలను బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తి గుట్టు రట్టయింది. దీంతో విషయం తెలుసుకున్న సదరు ప్రముఖ టీవీ ఛానల్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అసలు విలేకరి జీడిమెట్ల పోలీస్ స్టేషన్ వద్ద ఓ రోడ్డు ప్రమాదం కేసులో సెటిల్మెంట్ చేసేందుకు వచ్చిన నకిలీ విలేకరిని పట్టుకొని పోలీసులకు అప్పగించాడు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు సత్యనారాయణ

• బాగోతం బయటపడిందిలా…

జీడిమెట్ల పీఎస్ పరిధి సుభాష్ నగర్ ఆయిమాత దేవాలయం సమీపంలోని ఎక్సలెంట్ ఎక్విప్మెంట్ పరిశ్రమలో వాచ్మెన్ గా సత్యనారాయణ (63) పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఈనెల 9వ తేదీన విధులు పూర్తి చేసుకొని ఇంటికి వెళ్లే క్రమంలో ప్రధాన రహదారిలో రోడ్డు దాటుతున్న సమయంలో జీడిమెట్ల డివిజన్ పరిధి ప్రాగాటూల్స్ కాలనీకి చెందిన సోమేశ్ కుమారుడు సాయి విష్ణు (19) అనే యువకుడు వేగంగా ద్విచక్ర వాహనంపై వచ్చి సత్యనారాయణను ఢీకొట్టాడు. దీంతో ఎడమ కాలికి తీవ్రగాయం కావడంతో పాటు శరీరంపై చిన్న చిన్న గాయాలు అయ్యాయి. ఈ మేరకు తొలుత ఆర్ఎంపి డాక్టర్ వద్దకు అక్కడ నుంచి స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి సత్యనారాయణ ను చికిత్స నిమిత్తం సాయి విష్ణు స్నేహితుడు తరలించగా సాయి విష్ణు అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న సత్యనారాయణ కుమారుడు రామకృష్ణ అందించిన ఫిర్యాదు మేరకు జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విషయంలో సెటిల్మెంట్ చేసి బాధితుడు సత్యనారాయణకు న్యాయం చేస్తానంటూ రామకృష్ణ స్నేహితుడి ద్వారా పరిచయమైన కుత్బుల్లాపూర్ జయరాం నగర్ కు చెందిన నకిలీ విలేఖరి పసుపులూరి ధర్మపురి (38) పూనుకున్నాడు. ఈ నేపథ్యంలో సాయి విష్ణు తల్లిదండ్రులకు నకిలీ విలేకరి ధర్మరాజు పదేపదే ఫోన్ చేస్తూ తాను ఓ ప్రముఖ టీవీ ఛానల్ కు చెందిన విలేకరునని వెంటనే కేసు విషయం సెటిల్ చేసుకోవాలని లేకుంటే తీవ్ర ఇబ్బందులు పడతారని బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు డిమాండ్ చేసాడు. ఈ క్రమంలో విసిగివేసారిన సాయి విష్ణు తల్లి జీడిమెట్ల పోలీస్ స్టేషన్ వద్దకు వస్తే సెటిల్ చేస్తామని చెప్పడంతో అక్కడికి వచ్చిన ధర్మపురి నకిలీ బాగోతం బయటపడింది.

• అసలుకు చిక్కిన నకిలీ…
జీడిమెట్ల పోలీస్ స్టేషన్ వద్ద సెటిల్మెంట్ చేసే సమయంలో సదరు టీవీ ఛానల్ కు సంబంధించిన అసలు విలేఖరి అక్కడే ఉండడం, దానిని గుర్తించిన పలువురు తమ ఛానల్ పేరు చెప్పి ధర్మపురి బెదిరింపులకు పాల్పడి సెటిల్మెంట్ చేసేందుకు వచ్చారని తెలిపారు. దీంతో అక్కడికి చేరుకున్న అసలు విలేకరి నకిలీ విలేకరిని ఆరా తీయగా పొంతనలేని సమాధానాలతో బొంకడంతో పాటు తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఈ మేరకు ధర్మపురిని పట్టుకొని అసలు విలేకరి పోలీసులకు అప్పగించాడు.

• పోలీసులు… ఎందుకీ నిర్లక్ష్యం…
ఇక రోడ్డు ప్రమాద విషయానికి వస్తే… ఈనెల 9వ తేదీన సాయంత్రం 6.07 గంటలకు ప్రమాదం జరిగితే అదే రోజు ఎఫ్ఐఆర్ అయిందని పోలీసులు చెప్పినప్పటికీ ఎటువంటి పురోగతి లేనట్లు తేట తెల్లమవుతుంది. ప్రమాదం జరిగి 10 రోజులు కావస్తున్న సంఘటన జరిగిన స్థలానికి కానీ, బాధితుడు చికిత్స పొందుతున్న ఆసుపత్రికి గానీ పోలీసులు వెళ్లి దర్యాప్తు చేసిన దాఖలాలు కనబడటం లేదు. కాగా బాధితుడి కుమారుడికి పోలీసులు ఫోన్ చేసి ఆసుపత్రిలో ఉన్న తన తండ్రి ఫోటోలు వాట్సాప్ లో పెట్టమని అడగడంలో వారి చిత్తశుద్ధి అవగతం అవుతుంది. అక్కడ జరిగిన ప్రమాద దృశ్యాల సిసి ఫుటేజ్ లను కూడా బాధిత కుటుంబ సభ్యులే తీసి పోలీసులకు పంపినట్లు వారు తెలిపారు. దీనిపై కుటుంబ సభ్యులు పోలీసులపై మండిపడ్డట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ప్రమాదానికి కారణమైన సాయి విష్ణుకి డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేకుండా వాహనాన్ని నడిపాడు. అయినా ఇంతవరకు సాయి విష్ణు కానీ, తనకు వాహనం ఇచ్చిన వారిని కానీ, ప్రమాదానికి కారణమైన ద్విచక్ర వాహనాన్ని పట్టుకోవడంలో పోలీసులు నిర్లక్ష్యం వహించారనేది స్పష్టమవుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి ప్రమాదానికి కారణమైన సాయి విష్ణు గురువారం జీడిమెట్ల పోలీస్ స్టేషన్ కు వచ్చి అంతా కలయ తిరుగుతూ ఉన్న అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నం గాని, విచారణ గాని చేయకపోవడం విశేషం.

Leave A Reply

Your email address will not be published.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More