జిహెచ్ఎంసి వర్సెస్ విద్యుత్ శాఖ
• చెట్ల కొమ్మల తొలగింపు విషయంలో వివాదం
• పనులను అడ్డగించిన జిహెచ్ఎంసి అధికారులు
• రోడ్లపైనే చెట్ల కొమ్మలను వదిలేస్తున్న విద్యుత్ శాఖ
• అస్తవ్యస్తంగా మారుతున్న పరిసర ప్రాంతాలు
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), నవంబర్ 19: నరికేసిన చెట్ల కొమ్మల తొలగింపు విషయంలో రెండు ప్రభుత్వ రంగ సంస్థల మధ్య కుత్బుల్లాపూర్ లో వివాదం నెలకొంది. విద్యుత్ శాఖ విద్యుత్ లైన్ల మరమ్మతు, నిర్వహణ (మెయింటెనెన్స్) లో భాగంగా పలు ఫీడర్ల పరిధిలో చెట్ల కొమ్మల తొలగింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటుంది. తొలగించిన చెట్ల కొమ్మలను ఎక్కడికి అక్కడే ఇష్టానుసారం పడేయడంతో ఆ ప్రాంతమంతా దుర్గంధ పూరితంగా మారుతుంది. అంతేకాకుండా పారిశుద్ధ్య సమస్య ఏర్పడడంతో పాటు ప్రజల రాకపోకులకు అవి ఇబ్బందికరంగా మారి ప్రమాదాలకు కారణాలు అవుతున్నాయి.
వాటిని చూసిన ప్రజలు పారిశుద్ధ్య సమస్యగా పరిగణించి పలు సామాజిక మాధ్యమాల ద్వారా జిహెచ్ఎంసి ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో జిహెచ్ఎంసి పారిశుద్ధ్య విభాగంలోని సిబ్బందిపై అధిక భారం పడుతుంది. ప్రతిరోజు వారు నిర్వహించే విధులతోపాటు చెట్ల కొమ్మలు తొలగింపు పనులు కూడా చేయవలసి రావడంతో దాని ప్రభావం ప్రధాన పారిశుధ్యం పై పడుతుంది. ఇదే తంతు గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతుండడంతో విసిగివేసారిన జిహెచ్ఎంసి పారిశుధ్య సిబ్బంది చెట్ల కొమ్మల నరికి ఇష్టానుసారం రహదారులపై వదిలేస్తున్న విద్యుత్ శాఖ సిబ్బంది పనులను కుత్బుల్లాపూర్ సర్కిల్ ఏ ఎం ఓ హెచ్ కవిత ఆధ్వర్యంలో మంగళవారం అడ్డగించారు. చెట్ల కొమ్మలు నరకడానికి వాహనాలతో పాటు కార్మికుల వద్ద ఉన్న గొడ్డలను లాక్కున్నారు.
చెట్ల కొమ్మల నరకడానికి వీలులేదని, నరికిన కొమ్మలను వెంటనే లభించేలాగైతేనే పనులు చేసుకోవాలని అక్కడ ఉన్న ఏఈని నిలదీశారు. అనంతరం ఉప కమిషనర్ వి. నరసింహతో కలిసి సానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ (ఎస్ఎఫ్ఏ)లు వెన్నెలగడ్డలోని విద్యుత్ శాఖ డీఈ కార్యాలయానికి వెళ్లి డిఈ పోతరాజు జాన్ ను కలిసి ఎదురవుతున్న సమస్యను వివరించారు. దీనిపై స్పందించిన డిఈ సదరు సమస్యపై విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు, జిహెచ్ఎంసి ఉన్నతాధికారులతో చర్చిస్తున్నారని త్వరలోనే వారి ఆదేశాల మేరకు సదరు సమస్యపై దృష్టి కేంద్రీకరిస్తామని తెలిపారు.