గాజులరామారం సర్వేనెంబర్ 307 ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకోవాలి

• తప్పుడు ఓ ఆర్ సి లతో ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల పేర్లపై రిజిస్ట్రేషన్
• హైకోర్టు ఉత్తర్వులను సైతం బెఖాతరు చేస్తున్న కబ్జాదారులు, అధికారులు…
• ఆక్రమణలపై తహసిల్దార్ కు ఫిర్యాదు అందజేసిన ఆకుల సతీష్
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), అక్టోబర్ 9:
గాజులరామారం డివిజన్ పరిధిలోని సర్వే నంబర్ 307 లో ఉన్న ప్రభుత్వ స్థలాలను కాపాడి తక్షణమే స్వాధీనం చేసుకోవాలని బిజెపి నిజాంపేట మాజీ అధ్యక్షుడు ఆకుల సతీష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు కుత్బుల్లాపూర్ తహసిల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో సుజాతకు ఆయన వినతి పత్రాన్ని గురువారం అందజేశారు. సర్వేనెంబర్ 307లోని ప్రభుత్వ స్థలంలో 11 ఎకరాలను తప్పుడు ఓ ఆర్ సి ల ఆధారంగా మాజీ ఎమ్మెల్యే గాంధీ కుటుంబ సభ్యుల పేర్లపై రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు, ధరణి పోర్టల్‌లో కూడా అవే పేర్లతో ఎక్కించినట్లు వినతి పత్రంలో పేర్కొన్నారు. సదరు స్థలం చుట్టూ అక్రమంగా ఏర్పాటు చేసిన రేకులను హైడ్రాధికారులు గత నెల కూల్చివేసిన వాటిని పునర్నిర్మించుకున్నారని అన్నారు. అనంతరం ఆకుల సతీష్ మాట్లాడుతూ… గాజులరామారం 307 సర్వే నంబర్ కింద ఉన్న ఉప సర్వే నంబర్లు 307/ఆ/1, 307/ఆ/2, 307/ఆ/3, 307/ఆ/4, 307/ఆ/5, 307/ఆ/7, 307/3 వంటి మొత్తం 8 సర్వే నంబర్లలో ప్రభుత్వ మిగులు సీలింగ్ భూములు ఉన్నప్పటికీ, అవి ప్రైవేట్ వ్యక్తుల పేరిట తప్పుడు పత్రాలతో రిజిస్టర్ చేయించుకున్నారని ఆరోపించారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కుటుంబ సభ్యుల పేర్లతో ధరణి రికార్డుల్లో నమోదు చేయించుకున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ భూములను నాలా బదిలీ చేసుకుని అభివృద్ధి పనులు ప్రారంభించారని ఆయన విమర్శించారు.
• హైకోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ నిర్మాణాలు…
హైకోర్టు (డబ్ల్యూపి 29001/2025)లో సదరు భూములపై చర్యలు తీసుకోవద్దని ఇచ్చిన తాత్కాలిక ఉత్తర్వులను దుర్వినియోగం చేసుకుని, అధికారులు కూల్చిన ఫెన్సింగ్ ను మళ్లీ పునర్నిర్మించి నిర్మాణాలు కొనసాగిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు మరో కేసులో ( డబ్ల్యూపి 203/2024) సర్వే నంబర్ 307/D లో సుమారు 87 ఎకరాలు ప్రభుత్వ భూమిగా నిర్ధారించి, ప్రజా అవసరాలకు వినియోగించాలని ఆదేశించినా, అధికారులు ఇప్పటివరకు ఆ భూములను స్వాధీనం చేసుకోలేదని ఆకుల సతీష్ తెలిపారు.
• రూ. 100 కోట్ల విలువైన ఆస్తి కబ్జా…
బీజేపీ నేత భరత్ రెడ్డి, దేవా కలిసి ప్రభుత్వ భూమిని ఆక్రమించి ప్రైవేట్ వెంచర్ గా చూపిస్తూ దాదాపు 7 ఎకరాల ప్రభుత్వ భూమిపై నిర్మాణాలు చేసి అమ్మకాలు జరిపారని, సుమారు రూ.100 కోట్ల విలువైన ఆస్తిని కబ్జా చేసుకున్నారని ఆరోపించారు. హైకోర్టు ఆ భూములు ప్రభుత్వానికి చెందుతాయని తేల్చినప్పటికీ, అధికారులు వాటిని స్వాధీనం చేసుకోకుండా తూతూ మంత్రంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
• ఎమ్మెల్యే వివేకానంద్ అనుచరులపై కబ్జా ఆరోపణలు…
బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ అనుచరులు కూడా 2022–2024 మధ్యకాలంలో సుమారు 100 నుండి 150 ఎకరాల వరకు ప్రభుత్వ భూమిని కబ్జా చేసి వెంచర్లు వేసి ప్లాట్లుగా అమ్మారని ఆకుల సతీష్ తెలిపారు.
గాలిపోచమ్మ కాలనీ, హబీబ్ బస్తి, బాలయ్య నగర్, మాహదేవపురం, మిథిలా నగరం పేర్లతో ఏర్పడిన ఈ వెంచర్లు ప్రభుత్వ మిగులు సీలింగ్ భూముల్లో ఉన్నాయన్నారు. ఆ సమయంలోనే అప్పటి జిల్లా కలెక్టర్ హరీష్ ఈ విషయాన్ని గుర్తించి నివేదిక సమర్పించి, కుత్బుల్లాపూర్ ఆర్‌ఐని సస్పెండ్ చేసినప్పటికీ, పెద్దగా చర్యలు తీసుకోలేదని ఆయన పేర్కొన్నారు.
• పిడీ యాక్ట్ పెట్టి, ఆస్తులు జప్తు చేయాలని డిమాండ్…
ప్రభుత్వ భూములను అక్రమంగా కబ్జా చేసి, వెంచర్లు వేసి, పేద ప్రజలకు ప్లాట్లు అమ్మిన వారిపై పీడీ యాక్ట్ విధించడమే కాకుండా వారి ఆస్తులను జప్తు చేయాలని ఆకుల సతీష్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం భూములను స్వాధీనం చేసుకుని చుట్టూ ఫెన్సింగ్ వేసి రక్షించాలని, ఇకపై ఇలాంటి కబ్జాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. వినతి పత్రం అందించిన వారిలో అమలేశ్వరి, పున్నా రెడ్డి, అరుణ్ రావు, చందు, పండు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More