జీడిమెట్ల పోలీసులకు ఔట్ స్టాండింగ్ సర్వీస్ అవార్డు
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), మే 11: హైదరాబాద్లోని తల సేమియా సొసైటీ ఆధ్వర్యంలో జీడిమెట్ల పోలీసులకు ఔట్ స్టాండింగ్ సర్వీస్ అవార్డు ప్రదానం చేశారు. పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో నిర్వహించిన భారీ రక్తదాన శిబిరంలో 423 యూనిట్ల రక్తాన్ని సేకరించి, అవసరమైన చిన్నారులకు అందించడంలో విశేష సేవలు అందించినందుకు ఈ అవార్డు అందించారు. ప్రతి సంవత్సరం అత్యధిక స్థాయిలో రక్తదాన శిబిరాలు నిర్వహించి, ఎక్కువ మొత్తంలో రక్త యూనిట్లను సేకరించే సంస్థలు, వ్యక్తులు, విభాగాలకు తల సేమియా సొసైటీ ఈ అవార్డును ప్రదానం చేస్తుంది. ఈ ఏడాది జీడిమెట్ల పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన శిబిరం ద్వారా అత్యధిక రక్త యూనిట్లు సేకరించబడటంతో ఈ గౌరవం దక్కింది.
ఈ సందర్భంగా జీడిమెట్ల సీఐ గడ్డం మల్లేష్ మాట్లాడుతూ.. ఈ అవార్డు రావడానికి సహకరించిన జీడిమెట్ల ప్రాంత ప్రజలకు, రక్తదానం చేసిన రక్తదాతలకు, కార్యక్రమం విజయవంతానికి తోడ్పడిన దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు మార్గనిర్దేశం చేసిన ఉన్నతాధికారులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజల శాంతి పద్ధతులతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా జీడిమెట్ల పోలీసులు ఎల్లప్పుడు ముందుండి సేవలందిస్తారన్నారు.