క్రైస్తవుల స్మశాన వాటిక సమస్య పరిష్కరించాలి
• ప్రభుత్వాన్ని కోరిన కుత్బుల్లాపూర్ క్రిస్టియన్ మైనారిటీ రివైవల్ పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్
గాజులరామారం (న్యూస్ విధాత్రి), మే 9: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారంలోని సీయోను చర్చిలో క్రిస్టియన్ మైనారిటీ కుత్బుల్లాపూర్ రివైవల్ పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫెలోషిప్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత క్రైస్తవ మైనారిటీల సంక్షేమానికి పలు పథకాలు అమలు చేస్తోందని పేర్కొన్నారు. క్రైస్తవ సమాజం ఎల్లప్పుడూ కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తూ వచ్చిందని తెలిపారు. గత అసెంబ్లీ, లోక్‌సభ, మున్సిపల్, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో క్రైస్తవ సమాజం కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి విజయానికి సహకరించిందని పేర్కొన్నారు. క్రైస్తవ మతానికి ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి మహమ్మద్ అలీ షబ్బీర్, క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్, కాంగ్రెస్ కుత్బుల్లాపూర్ ఇన్చార్జ్ కొలన్ హనుమంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. క్రైస్తవ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, ప్రతి సంవత్సరం లక్షలాది మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు అందిస్తున్నట్లు చెప్పారు. అలాగే చర్చిల పునర్నిర్మాణానికి నిధులు, క్రైస్తవ మహిళల ఉపాధి కోసం కుట్టుమిషన్లు, క్రిస్మస్ వేడుకల నిర్వహణకు ఆర్థిక సహాయం అందిస్తున్నారని తెలిపారు. అయితే హెచ్ఎండీఏ పరిధిలో క్రైస్తవ స్మశానవాటిక లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా క్రైస్తవుల కోసం స్మశాన వాటిక ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఫెలోషిప్ ప్రెసిడెంట్ రెవరెండ్ గోడి శేఖర్, సెక్రటరీ బిషప్ శామ్యూల్, ట్రెజరర్ పాస్టర్ దయానిధి, కోఆర్డినేటర్ కల్లోజి రవికుమార్, వైస్ ప్రెసిడెంట్ ఆనంద్ బాబు, జాయింట్ సెక్రటరీ సీహెచ్ బెల్తాజర్ రాజ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ జి. రాజశేఖర్‌తో పాటు వివిధ డివిజన్ల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ట్రెజరర్లు, కాలనీలకు చెందిన చర్చి పాస్టర్లు, క్రిస్టియన్ నాయకులు పాల్గొన్నారు.