సాధారణ ఎన్నికలను తలపించిన బాపునగర్ సంక్షేమ సంఘం ఎన్నికలు
• అధ్యక్షుడిగా జగదీష్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా దయానంద్ విజయం
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), మే 18: కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని బాపునగర్ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపించాయి. ముందు నుంచి హోరాహోరీ ప్రచారాలతో సాగిన ఎన్నికల ప్రక్రియ ఆదివారం ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. స్థానిక ఆర్ఎస్కే పాఠశాలలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఎన్నికల అధికారి జి. రాజేశం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఎన్నికల ప్రక్రియలో కాలనీ వాసులు పెద్ద ఎత్తున పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాలనీలో మొత్తం 438 ఓట్లకు గాను 383 ఓట్లు పోలయ్యాయి. ఎన్నికల్లో జగదీష్ గౌడ్ నేతృత్వంలోని ప్యానల్ ఘన విజయం సాధించింది. అధ్యక్ష పదవికి పోటీ చేసిన జగదీష్ గౌడ్ తన ప్రత్యర్థి నరేష్‌పై 63 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అలాగే ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేసిన చిట్టిమిల్ల దయానంద్ తన ప్రత్యర్థి సంతోష్‌పై 102 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొంది సత్తా చాటారు. ఈ సందర్భంగా విజేతల మద్దతుదారులు కాలనీ వీధిలో భారీ ర్యాలీ నిర్వహించి సంబరాలు జరుపుకున్నారు.

కాలనీ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని నూతన కార్యవర్గ సభ్యులు హామీ ఇచ్చారు. బాపు నగర్ అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొంటూ కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు సమిష్టిగా పనిచేస్తామని తెలిపారు. అలాగే కాలనీలో పారిశుధ్యం, డ్రైనేజీ, రోడ్లు, వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాలు, సీసీ కెమెరాలు ఏర్పాటు వంటి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని వెల్లడించారు. ప్రజల సహకారంతో కాలనీని ఆదర్శవంతమైన ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నామని నూతన కమిటీ సభ్యులు పేర్కొన్నారు. తమకు మద్దతు తెలిపి విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి వారు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగియగా, కాలనీ వాసులు నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎన్నికల ప్రక్రియలో అభ్యర్థులు బాబు, సుబ్బారావు, నాగరాజు, కాలనీవాసులు పాల్గొన్నారు.