వర్షాకాలానికి ముందే దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు డిమాండ్

• జీడిమెట్ల ఉప కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించిన బీఆర్ఎస్ నేత నరేందర్ రెడ్డి, సీనియర్ సిటిజన్లు
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జూన్ 1: కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలో దెబ్బతిన్న ప్రధాన, అంతర్గత రహదారులకు వర్షాకాలం ప్రారంభానికి ముందే అత్యవసర మరమ్మతులు చేపట్టాలని కోరుతూ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వి. నరేందర్ రెడ్డి, సీనియర్ సిటిజన్ సంక్షేమ సంఘం సభ్యులు జీడిమెట్ల సర్కిల్ ఉప కమిషనర్ శంకర్ సింగ్‌కు సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ… శివాజీ సర్కిల్, రాఘవేంద్ర కాలనీ, గోదావరి హోమ్స్ పరిసరాలు, గాయత్రి నగర్, దుర్గా ఎస్టేట్, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్ గ్రామాలతోపాటు తదితర ప్రాంతాల్లో రహదారులు పూర్తిగా దెబ్బతిని పెద్ద గుంతలు ఏర్పడ్డాయని తెలిపారు. దీంతో వాహనదారులు, విద్యార్థులు, మహిళలు, వృద్ధులు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. త్వరలో వర్షాకాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ గుంతల్లో వర్షపు నీరు నిలిచి ప్రమాదాల ముప్పు మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల భద్రత దృష్ట్యా వెంటనే వాటికి మరమ్మతు పనులు చేపట్టి గుంతలను పూడ్చాలని అధికారులను కోరారు.

డిసి శంకర్ సింగ్ కు సమస్యను వివరిస్తున్న సీనియర్ సిటిజన్లు

అలాగే పూర్తిగా దెబ్బతిన్న ప్రధాన, అంతర్గత రహదారులకు సంబంధించి ఇంజినీరింగ్ అంచనాలు సిద్ధం చేసి, శాశ్వత ప్రాతిపదికన కాంక్రీట్, తారు రోడ్ల నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు రూపొందించి నిధులు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల భద్రత, రవాణా సౌలభ్యం దృష్ట్యా ఈ సమస్యను అత్యంత ప్రాధాన్యతతో పరిగణించి వెంటనే పనులు ప్రారంభించాలని నరేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. దీనికి స్పందించిన శంకర్ సింగ్ జూన్ 3వ తేదీ నుంచి రహదారుల మరమ్మతు పనులు ప్రారంభించి రోడ్లలోని గుంతలను పూడ్చే కార్యక్రమాన్ని చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కృష్ణనగర్ కాలనీ అధ్యక్షుడు హరిప్రసాద్, మహానగర్ కాలనీ అధ్యక్షుడు కుమార్, కుత్బుల్లాపూర్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ప్రతినిధులు పెద్ది మల్లేష్, మురళి గౌడ్, నార్ల కంటి నాగేష్, శంకర్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రామచంద్ర రెడ్డి, రమణ రావు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More