అసంఘటిత కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం

• కాంట్రాక్టు, వలస కార్మికుల శ్రమదోపిడీపై చర్యలు

• నకిలీ కార్మిక నాయకులు కార్మికులను మోసం చేస్తున్నారు

కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), అక్టోబర్ 29:
కాంట్రాక్టు, వలస కార్మికుల శ్రమను దోచుకుంటున్న పారిశ్రామిక యాజమాన్యాలపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని సిఐటియు మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షుడు ఈ. దేవదానం డిమాండ్ చేశారు. ఈనెల 25, 26 తేదీలలో సిఐటియు మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా 4వ మహాసభలు చర్లపల్లి పారిశ్రామిక ప్రాంతంలో నిర్వహించారు. ఈ సభల్లో జీడిమెట్ల ప్రాంతానికి చెందిన పారిశ్రామిక హమాలీ సంఘ నాయకులు ఈ. దేవదానం జిల్లా ఉపాధ్యక్షుడిగా, పసుల అంజయ్య జిల్లా కమిటీ సభ్యుడిగా ఎన్నుకోబడ్డారు. ఈ మేరకు సిఐటియు కుత్బుల్లాపూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో కీలుకాని లక్ష్మణ్ అధ్యక్షతన షాపూర్ నగర్ కార్యాలయంలో వారిని బుధవారం సన్మానించారు. జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతంలో ఏ కార్మికుడికైనా అన్యాయం జరిగినా సిఐటియు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తుందని వారు అన్నారు. గతంలో పలువురు యాజమాన్యాలు కార్మికుల వేతనాలు నిలిపివేసిన సందర్భాల్లో సిఐటియు ఆధ్వర్యంలో ఆ వేతనాలు ఇప్పించడం జరిగిందని పేర్కొన్నారు. వలస కార్మికులను పర్మినెంట్ కార్మికులుగా నియమించకుండా కాంట్రాక్టు పేరుతో రోజుకు 12 నుంచి 16 గంటల పాటు పనిచేయిస్తున్నారు. కనీస వేతనాలు, ఈఎస్ఐ, పిఎఫ్ వంటి హక్కులు ఇవ్వకుండా, విధి నిర్వహణలో ప్రమాదాలు జరిగినప్పుడు వైద్యం కూడా నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. కొన్ని చోట్ల కొంతమంది నకిలీ కార్మిక నాయకులు కార్మికుల ప్రమాదాల పరిహార సెటిల్‌మెంట్లలో కార్మికులను మోసం చేసి వారి జేబులు నింపుకుంటున్నారని ఆరోపించారు. అసంఘటిత రంగంలోని హమాలీ, భవన నిర్మాణ, రవాణారంగ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కే. శీను, డి. కరుణాకర్, శ్రీశైలం, వీరేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More