ఆర్జీకే చిరు వ్యాపారుల షాపులు తొలగించవద్దు: ఎమ్మెల్యే, జోనల్ కమిషనర్‌కు వినతి
కుత్బుల్లాపూర్, జూన్ 10 (న్యూస్ విధాత్రి): జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని రాజీవ్ గృహకల్ప (ఆర్జీకే) సముదాయంలో జీవనోపాధి కోసం ఏర్పాటు చేసుకున్న చిరు వ్యాపారుల దుకాణాలను తొలగించవద్దని కోరుతూ ఆర్జీకే సంక్షేమ సంఘం నాయకులు, వ్యాపారులు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి. వివేకానంద గౌడ్, కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్ పింకేష్ కుమార్ కు బుధవారం వినతిపత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆర్జీకే సముదాయంలో గత 18 సంవత్సరాలుగా సుమారు 1,779 కుటుంబాలు, దాదాపు 7 వేల మంది జనాభా నివసిస్తున్నప్పటికీ స్థానికంగా ఎలాంటి షాపింగ్ కాంప్లెక్స్ లేకపోవడంతో ప్రజలు నిత్యావసర వస్తువుల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందన్నారు. ఈ నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన పేద కుటుంబాలు జీవనోపాధి కోసం చిన్నచిన్న దుకాణాలు ఏర్పాటు చేసుకుని వ్యాపారాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. అయితే ఇటీవల జీహెచ్ఎంసీ అధికారులు మూడు రోజుల్లోగా దుకాణాలను స్వచ్ఛందంగా తొలగించుకోవాలని, లేనిపక్షంలో ప్రోక్లైనర్ తో తొలగిస్తామని హెచ్చరించారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా షాపులను తొలగిస్తే వందలాది కుటుంబాలు ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. తమ జీవనాధారమైన షాపులను తొలగించకుండా యథావిధిగా వ్యాపారాలు కొనసాగించుకునే అవకాశం కల్పించి న్యాయం చేయాలని ఎమ్మెల్యే, జీహెచ్ఎంసీ అధికారులను కోరినట్లు తెలిపారు.