ఆర్టీఐ కార్యకర్త మధుబాబు హత్యాయత్నం కేసులో కీలక మలుపు
• సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్ కు డిమాండ్
• రాష్ట్ర గవర్నర్‌కు నిందితుడు బాలరాజు ఫిర్యాదు
• అసలు నిందితులు లంచం ఇచ్చి తప్పించుకున్నారు
• 2017లో ఆర్టీఐ కార్యకర్త వాకిటి మధుబాబు పై దాడి కేసు
• ఏసీపి గోవర్ధన్ ఆధారాలు నాశనం చేశారని ఆరోపణ
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), ఆగస్టు 11:
సైబరాబాద్ పరిధిలోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్లో 2017లో నమోదైన ఆర్టిఐ కార్యకర్త వాకిటి మధుబాబు హత్యాయత్నం కేసులో మళ్లీ దర్యాప్తు జరిపి అదనపు, అనుబంధ (సప్లిమెంటరీ) ఛార్జ్‌షీట్ దాఖలు చేయాలని రాష్ట్ర గవర్నర్ సెక్రెటరీకి బాధితుడు హనుమంతుల బాలరాజు సోమవారం ఫిర్యాదు అందజేశాడు. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 138/2017లో ఆర్టీఐ కార్యకర్త వాకిటి మధు బాబుపై దాడి జరిగినట్లు కేసు నమోదై, సెక్షన్లు 307, 201, 212, ఇండియన్ ఆర్మ్స్ యాక్ట్ 25(1), ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్ 3(2)(వి) కింద నిందితుడు బాలరాజు పై ఆరోపణలు నమోదయ్యాయి. అయితే తాను హత్యాయత్నం చేయడానికి ప్రోత్సహించి, ప్రేరేపించి నేరానికి పాల్పడేందుకు కారణమైన అసలు నిందితులు ప్రస్తుత కాంగ్రెస్ నాయకుడు సయ్యద్ రషీద్, రాష్ట్ర ప్రైవేటు పాఠశాలల సంఘం అధ్యక్షుడు శివరాత్రి యాదగిరి, గాజులరామారం డివిజన్ కార్పొరేటర్ రావుల శేషగిరి వీరిని కూడా సప్లిమెంటరీ చార్జిసీటు ద్వారా కేసులో చేర్చాలని బాలరాజు వినతిపత్రంలో పేర్కొన్నాడు. వారు కుత్బుల్లాపూర్ లోని ప్రైవేటు పాఠశాలల సంఘం నిధులను వినియోగించి నేరానికి ప్రోత్సహించారని తెలిపాడు. ఈ కేసులో దర్యాప్తు అధికారిగా ఉన్న బాలానగర్ డివిజన్ ఏసిపి గోవర్ధన్ వారిని అరెస్టు చేస్తానని చెప్పి, అనంతరం కుత్బుల్లాపూర్ మండలంలోని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలను బెదిరించి వారి వద్ద నుంచి సుమారు కోటి రూపాయలు లంచం తీసుకొని, ఆధారాలను నాశనం చేశారని ఫిర్యాదులో ఆరోపించారు. కేసును తిరిగి తెరిచి సరైన విచారణ జరిపించి సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్ దాఖలు చేయాలని కోరాడు. రషీద్, యాదగిరి, రావుల శేషగిరి వల్ల తనకు, తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని, వారికి భద్రత కల్పించేలా పోలీసులకు ఆదేశాలు జారీ చేయాలని గవర్నర్ కార్యాలయంలో అందించిన ఫిర్యాదులో బాలరాజు అభ్యర్థించాడు. న్యాయం దృష్ట్యా పోలీసులు జరిపే దర్యాప్తు ప్రక్రియలో తాను ఎటువంటి భయం లేకుండా పూర్తిగా సహకరిస్తానని పేర్కొన్నాడు.
• అసలు జరిగిందేంటి…
2017 వ సంవత్సరంలో అక్రమంగా, అక్రమా అనుమతులతో నిర్వహిస్తున్న పలు ప్రైవేట్ పాఠశాలలపై ఆర్టీఐ కార్యకర్త వాకిటి మధుబాబు పలు పిటిషన్ దాఖలు చేశారు. దీనిని జీర్ణించుకోలేని పలువురు మధుబాబు హతమార్చేందుకు బాలరాజుకు సుఫారీ ఇచ్చి ప్రేరేపించారు. దీంతో జిరాక్స్ దుకాణంలో పేపర్లు జిరాక్స్ తీస్తుండగా బాలరాజు మధు బాబు పై దాడి చేసి కత్తితో విచక్షణ రహితంగా పొడిచి పరారయ్యాడు. దీంతో తీవ్ర గాయాల పాలైన మధుబాబును స్థానికులు, పోలీసులు ఆస్పత్రికి తరలించే చికిత్స అందించడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ సంఘటనపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి బాలరాజును ప్రధాన నిందితుడిగా చేర్చారు. ఇదిలా ఉండగా… తనతోపాటు తాను హత్య చేసేందుకు ప్రేరేపించిన సయ్యద్ రషీద్, శివరాత్రి యాదగిరి, రావుల శేషగిరిల పై సప్లిమెంటరీ చార్జిషీట్ దాఖలు చేసి విచారించాలని రాష్ట్ర గవర్నర్ కార్యాలయంలో నిందితుడు బాలరాజు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు కీలక మలుపు తిరుగుతూ కుత్బుల్లాపూర్ లో చర్చనీయాంశంగా మారింది.