ఆస్తి పన్ను నెలవారి వసూళ్లలో ద్వితీయ స్థానంలో కుత్బుల్లాపూర్
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), ఆగస్టు 1: కుత్బుల్లాపూర్ గాజులరామారం జంట సర్కిళ్ల పరిధిలో ఆస్తిపన్ను వసూళ్లపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఆర్థిక సంవత్సరం 2025 – 26 లో ఆస్తి పన్ను వసూళ్లలో ఉన్నతాధికారులు నిర్దేశించిన నెలవారి లక్ష్యాలను చేరుకునేందుకు రెవెన్యూ యంత్రాంగం ముమ్మర కసరత్తు చేస్తోంది. దీనిలో భాగంగా జూలై నెలకు ఉన్నతాధికారులు కుత్బుల్లాపూర్ సర్కిల్ కు గాను రూ. 7 కోట్లు, గాజులరామారం సర్కిల్ కు గాను రూ. 6 కోట్ల ఆస్తి పన్ను వసూళ్ల లక్ష్యాన్ని నిర్దేశించారు. దీనిలో కుత్బుల్లాపూర్ సర్కిల్ జూలై నెలకు గాను రూ. 3.32 కోట్ల ఆస్తి పన్నును వసూలు చేసి 47.48 శాతంతో గ్రేటర్ పరిధిలో ద్వితీయ స్థానంలో నిలిచింది. దీనిలో జూలై 31వ తేదీన అత్యధికంగా రూ. 88 లక్షల ఆస్తి పన్ను వసూలు కావడం విశేషం. అలాగే గాజులరామారం సర్కిల్ జూలై నెలకు గాను రూ. 2.08 కోట్ల ఆస్తి పన్నును వసూలు చేసి 34.72 శాతంతో గ్రేటర్ పరిధిలో 7వ స్థానంలో నిలిచింది. దీనిలో జూలై నెల చివరి రోజు రూ. 38 లక్షల ఆస్తు పన్ను వసూలయ్యాయి. ఆస్తి పన్నులు సకాలంలో చెల్లించి నగరాభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని జంట సర్కిళ్ల ఉప కమిషనర్లు వి. నర్సింహ, ఎల్ పి. మల్లారెడ్డి కోరారు.