కూలీని కొట్టి రాత్రంతా స్తంభానికి కట్టేసి వేధింపులు… మరణం

కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), మే 1: పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందిన సునీల్ రామ్ (35) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం… సునీల్ రామ్ గోదావరి హోమ్స్ సమీపంలోని పామైరా మెడోస్ ప్రైడ్ ఇన్‌ఫ్రా నిర్మాణ స్థలంలో కూలీగా పనిచేస్తూ అక్కడే నివసిస్తున్నాడు. ఏప్రిల్ 30 రాత్రి సుమారు 10 గంటల సమయంలో అతను తన భార్యతో వ్యక్తిగత విషయాలపై గొడవ పడుతూ స్థానికంగా గందరగోళం సృష్టిస్తున్నట్లు సమాచారం. ఈ పరిస్థితిని గమనించిన నిర్మాణ ఇంజనీర్ ప్రసాద్‌తో పాటు మరో నలుగురు కూలీలు పరిస్థితిని సర్దుబాటు చేయాల్సిన బాధ్యతతో వ్యవహరించకుండా, సునీల్ రామ్‌ను బలవంతంగా పట్టుకుని దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం అతన్ని నిర్మాణ స్థలానికి తీసుకెళ్లి, కొబ్బరి తాడుతో సిమెంట్ స్తంభానికి కట్టి రాత్రంతా అక్కడే వదిలివెళ్లినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో సునీల్ రామ్ తీవ్ర గాయాలకు గురై, సమయానికి సహాయం అందకపోవడంతో అతని ఆరోగ్య పరిస్థితి విషమించి మరణించినట్లు అనుమానిస్తున్నారు. మే 1వ తేదీ ఉదయం సుమారు 9 గంటల సమయంలో సునీల్ రామ్ భార్య అతన్ని పరిశీలించగా, అతను మృతి చెందినట్లు గుర్తించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More