చెరుకుపల్లి కాలనీలో ఘనంగా శ్రీ నల్ల పోచమ్మ అమ్మవారి పునః ప్రతిష్ట
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), మే 1: ప్రజలంతా శ్రీ నల్ల పోచమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులతో సుఖసంతోషాలు ఆయురారోగ్యాలతో జీవించాలని, ఆలయాల అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని కుత్బుల్లాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీష్ అన్నారు. డివిజన్ లోని చెరుకుపల్లి కాలనీలో ఆలయ పునః నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ నల్ల పోచమ్మ అమ్మవారి ఆలయ అభివృద్ధి, విగ్రహ పునః ప్రతిష్ట కార్యక్రమం ఆద్యంతం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేఎం గౌరీష్ హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఏప్రిల్ 30వ తేదీన సాయంత్రం 6 గంటలకు అంకురార్పణ, మహాగణపతి పూజ, పుణ్యాహవచనం, పాలికార్చన అగ్ని ప్రతిష్ట తో కార్యక్రమం ప్రారంభమైంది. మే 1వ తేదీన ఉదయం మూలమంత్ర హవనం, దుర్గాసూక్తహవనం, పూర్ణాహుతి కళాన్యాసం అనంతరం ఉదయం 9.56 గంటలకు మూలమూర్తి నల్ల పోచమ్మ తల్లి విగ్రహాన్ని పునః ప్రతిష్టించారు.
అమ్మవారికి బోనం సమర్పించే భక్తులు 3వ తేదీ ఆదివారం సమర్పించాలని ఆలయ కమిటీ తెలిపారు. ఈ కార్యక్రమంలో చెరుకుపల్లి కాలనీ 1,2 కాలనీ వాసులతో పాటు పరిసర ప్రాంత ప్రజలు, భక్తులు, పలువురు సీనియర్ నాయకులు, పాల్గొన్నారు.