గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు
• సాయిబాబా నగర్ డివిజన్లో జెండా ఆవిష్కరణలు, బైక్ ర్యాలీ
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జనవరి 26:
దేశం గణతంత్ర రాజ్యంగా అవతరించి 77 ఏళ్లు పూర్తి చేసుకున్న శుభసందర్భంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని సాయిబాబా నగర్ డివిజన్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు గుంజ శ్రీనివాస్, యువ నాయకుడు, కాంగ్రెస్ పార్టీకి చెందిన గుంజా షణ్ముఖ సాయి ఆధ్వర్యంలో నిర్వహించిన పలు కార్యక్రమాలకు ప్రజల నుండి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా డివిజన్లోని వివిధ బస్తీలలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యత, రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య బలాన్ని గురించి గుంజా షణ్ముఖ సాయి మాట్లాడుతూ..దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగాలు చేసిన మహానుభావుల సేవలను స్మరించుకోవడం ప్రతి భారతీయుడి బాధ్యతని అన్నారు. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు, బాధ్యతలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని పిలుపునిచ్చారు.

అనంతరం వారి నేతృత్వంలో నిర్వహించిన బైక్ ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. త్రివర్ణ పతాకాలు, దేశభక్తి నినాదాలతో సాగిన ఈ ర్యాలీ డివిజన్లోని పలు ప్రధాన రహదారుల మీదుగా సాగింది. ఈ ర్యాలీ ద్వారా యువతలో దేశభక్తి భావాన్ని, ప్రజాస్వామ్య విలువలపై అవగాహనను పెంపొందించాలనే ఉద్దేశ్యాన్ని కాంగ్రెస్ నాయకులు వెల్లడించారు. ఈ బైక్ ర్యాలీలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు చాంద్ పాషా, విష్ణు బత్తుల, హెచ్ఎంటీ కృష్ణ, శంకర్, సంతోష్, వినోదా, దేవి, రాము తదితరులు పాల్గొని యువ నాయకులకు ప్రోత్సాహం అందించారు.

అలాగే యూత్ కాంగ్రెస్ నాయకులు సాయి, ప్రకాష్, వికాస్, డాక్టర్ సుధాకర్, శామ్యూల్, సందీప్, శ్యామ్, సతీష్ పెద్ద ఎత్తున పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు. స్థానిక ప్రజలు కూడా ఈ కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొని, జాతీయ పతాకానికి వందనం చేశారు. రానున్న రోజుల్లో కూడా ప్రజల మధ్య ఉండి సేవా కార్యక్రమాలు, జాతీయ పండుగల నిర్వహణ ద్వారా దేశభక్తిని పెంపొందించేందుకు నిరంతరం కృషి చేస్తామని గుంజ షణ్ముఖ సాయి తెలిపారు.