గులాబీ శ్రేణుల అత్యుత్సాహమా..? అవగాహన లేమితోనా…?

• తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాకు అవమానమా?
• కుత్బుల్లాపూర్‌లో వివాదానికి దారితీసిన ఘటన
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జూన్ 2:  తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని అయోధ్య నగర్ కోడలి వద్ద జరిగిన ఒక ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అదే జెండా స్తంభానికి బీఆర్ఎస్ పార్టీ జెండాను కూడా ఎగురవేసినట్లు స్థానికులు ఆరోపిస్తూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ప్రజలు, సామాజిక కార్యకర్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానికుల కథనం ప్రకారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా జాతీయ పతాకంతో పాటు అదే స్తంభానికి బిఆర్ఎస్ పార్టీకి చెందిన జెండాను కూడా కట్టి ఎగరవేశారు. భారత జాతీయ పతాకం ఏ రాజకీయ పార్టీకి, సంస్థకు లేదా వ్యక్తికి చెందినది కాదు. అది దేశ సమైక్యతకు, సార్వభౌమాధికారానికి, ప్రజాస్వామ్య విలువలకు ప్రతీక అని పేర్కొన్నారు. భారతీయుల గౌరవ భావనలతో ముడిపడి ఉన్న జాతీయ పతాకాన్ని రాజకీయ జెండాలతో సమానంగా లేదా వాటితో కలిపి ప్రదర్శించడం సముచితమేనా అనే ప్రశ్న ఇప్పుడు ప్రజల్లో చర్చకు దారి తీసింది.
• ఫ్లాగ్ కోడ్ ఉల్లంఘన జరిగిందా…?
భారత ప్రభుత్వం అమలు చేస్తున్న ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా 2002, ప్రకారం జాతీయ పతాకానికి ప్రత్యేక గౌరవం, మర్యాద కల్పించాల్సి ఉంటుంది. జాతీయ పతాకం ఎగురవేసే విధానం, దాని స్థాన ప్రాధాన్యం, ఇతర జెండాలతో ప్రదర్శించే నియమాలపై స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒకే స్తంభంపై జాతీయ పతాకంతో పాటు రాజకీయ పార్టీ జెండాను ప్రదర్శించడం నిబంధనలకు విరుద్ధమా…? అనే అంశంపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
• సామాజిక మాధ్యమాల్లో వైరల్…ప్రజల్లో ఆగ్రహం…
ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నట్లు సమాచారం. జాతీయ జెండా గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలపై మరింతగా ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. దేశ జెండా విషయంలో రాజకీయ భేదాలు, పార్టీ అనుబంధాలు పక్కనబెట్టి ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు.
• బీఆర్ఎస్ నాయకత్వం స్పందించాలని డిమాండ్…
ఈ ఘటనపై బీఆర్ఎస్ పార్టీ స్థానిక నాయకత్వం, కార్యకర్తలు ప్రజలకు వివరణ ఇవ్వాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇది అనుకోకుండా జరిగిన పొరపాటా? లేక నిబంధనలపై అవగాహన లేకపోవడం వల్ల జరిగిందా? అనే విషయాలపై స్పష్టత అవసరమని పేర్కొంటున్నారు. రాజకీయ కార్యక్రమాల్లో జాతీయ పతాక వినియోగం విషయంలో మరింత జాగ్రత్త అవసరమని అభిప్రాయపడుతున్నారు.
• విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి…
ఈ ఘటనపై సంబంధిత రెవెన్యూ, పోలీసు, మున్సిపల్ అధికారులు వెంటనే విచారణ చేపట్టి వాస్తవాలను వెలికితీయాలని స్థానికులు కోరుతున్నారు. ఒకవేళ ఫ్లాగ్ కోడ్ నిబంధనలు ఉల్లంఘించబడినట్లు తేలితే బాధ్యులపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దేశ గౌరవానికి ప్రతీక అయిన జాతీయ పతాకం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికీ తావు ఉండకూడదని ప్రజలు స్పష్టం చేస్తున్నారు. దేశ జెండా గౌరవం రాజకీయాలకు అతీతం. జాతీయ పతాకాన్ని గౌరవించడం ప్రతి భారతీయుడి రాజ్యాంగబద్ధమైన బాధ్యత. కుత్బుల్లాపూర్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Leave A Reply

Your email address will not be published.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More