తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం… అమరవీరుల స్థూపానికేది గౌరవం…?
• అమరవీరుల స్మారక చిహ్నాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి
• దుండిగల్ అధికారుల తీరు సిగ్గుచేటు: ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు
దుండిగల్ (న్యూస్ విధాత్రి), జూన్ 2: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల స్మారక చిహ్నాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబించడం తీవ్రంగా విచారకరమని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ పార్టీ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు శంభీపూర్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దుండిగల్ సర్కిల్ కార్యాలయంలోని అమరవీరుల స్థూపానికి అధికారులు కనీసం పూలమాల కూడా వేయలేదని తెలుసుకున్న ఆయన సందర్శించి, అక్కడి పరిస్థితులను పరిశీలించి ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం వేలాది మంది విద్యార్థులు, యువకులు, ఉద్యోగులు, ఉద్యమకారులు చేసిన త్యాగాలకు ప్రతీకగా నిలిచిన అమరవీరుల స్థూపం కనీస గౌరవానికి కూడా నోచుకోకపోవడం బాధాకరమని అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వంటి చారిత్రాత్మకమైన రోజున కూడా అధికారులు స్థూపాన్ని పట్టించుకోకపోవడంతో, స్థానిక ఉద్యమకారులతో కలిసి స్వయంగా స్థూపాన్ని నీటితో శుభ్రపరిచి పూలమాలలు వేసి అమరవీరులకు నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమం కేవలం రాజకీయ పోరాటం మాత్రమే కాదని, అది ప్రజల ఆత్మగౌరవం, స్వీయ పాలన కోసం సాగిన చారిత్రాత్మక ఉద్యమమని పేర్కొన్నారు. అలాంటి ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరుల జ్ఞాపకాలను సజీవంగా ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అయితే ప్రభుత్వం ఆ బాధ్యతను విస్మరించి అమరవీరుల స్థూపాలను నిర్లక్ష్యం చేయడం దురదృష్టకరమని విమర్శించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున కూడా అమరవీరుల స్థూపాన్ని పట్టించుకోకపోతే మరెప్పుడు పట్టించుకుంటారు? తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా? అంటూ ఆయన ప్రశ్నించారు. అమరవీరుల స్థూపాల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించడం అంటే కేవలం ఒక నిర్మాణాన్ని విస్మరించడం కాదని, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని, అమరవీరుల త్యాగాలను, ఉద్యమకారుల ఆత్మగౌరవాన్ని అవమానపరచడమేనని మండిపడ్డారు. వాటి పరిశుభ్రత, నిర్వహణ, భద్రత విషయంలో సంబంధిత శాఖలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఇదే విషయంపై జిల్లా కలెక్టర్ తో ఫోన్లో మాట్లాడినట్టు ఆయన తెలిపారు.

అమరవీరుల త్యాగాలే తెలంగాణ రాష్ట్ర నిర్మాణానికి పునాదులని, వారి సేవలను ఎప్పటికీ మరవలేమని ఆయన స్పష్టం చేశారు. ఇటువంటి సంఘటనలు మరల పునరావృతం అయితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు, బీఆర్ఎస్, బిజెపి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పలువురు కార్యకర్తలు పాల్గొని అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు.