చలివేంద్రాలు ప్రజల దాహార్తిని తీర్చేందుకు గొప్ప సేవ. – ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), ఏప్రిల్ 16: తీవ్ర ఎండల నేపథ్యంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాల ఏర్పాటు ఒక గొప్ప సేవ అని బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పేర్కొన్నారు. కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధి సుచిత్ర చౌరస్తాలో బిఆర్ఎస్ నాయకులు జలిగం రాకేష్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ట్రాఫిక్ ఏసీపీ వెంకట్ రెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరై గురువారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అలాంటి సమయంలో చలివేంద్రాల ద్వారా చల్లని తాగునీరు అందించడం ప్రజలకు ఉపశమనం కల్పిస్తుందన్నారు. ప్రజల సంక్షేమం కోసం బిఆర్ఎస్ పార్టీ ఎప్పటికప్పుడు ముందుంటుందని, ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.
సామాజిక బాధ్యతతో ముందుకు వచ్చి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఏసీపీ వెంకట్ రెడ్డి అన్నారు. వేసవి కాలంలో ఇలాంటి చలివేంద్రాలు ప్రజలకు ఉపశమనం కలిగిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ జీడిమెట్ల డివిజన్ సమన్వయ కమిటీ సభ్యులు, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు, సిబ్బంది తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.