జీడిమెట్లలో భారీ అగ్నిప్రమాదం

• గోదాం దగ్ధం, భారీ నష్టం
జీడిమెట్ల (న్యూస్ విధాత్రి), ఏప్రిల్ 9: జీడిమెట్ల పారిశ్రామిక వాడలో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సుభాష్‌నగర్ గంపల బస్తీ పరిధిలోని అక్రమ స్క్రాప్, కెమికల్ గోదాంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. గోదాంలో నిల్వ ఉంచిన ప్లాస్టిక్ వ్యర్థాలు, కెమికల్ డ్రమ్‌లకు మంటలు అంటుకోవడంతో క్షణాల్లోనే మంటలు వ్యాపించి, పరిసర ప్రాంతమంతా దట్టమైన నల్లటి పొగతో కమ్ముకుంది. దూరం నుంచే ఆ పొగ కనిపించడంతో ప్రజలు అప్రమత్తమయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

రోడ్డుపై ఎగిరిపడ్డ కెమికల్ డ్రమ్ము

ఈ ప్రమాదంలో గోదాంలో నిల్వ ఉన్న సామగ్రి పూర్తిగా దగ్ధమై భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. అయితే ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం సంభవించకపోవడం ఊరట కలిగించింది. అగ్నిప్రమాదానికి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. షార్ట్ సర్క్యూట్ లేదా కెమికల్ ప్రతిచర్య కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

దద్దమైన డెకరేషన్ గోదాం, పార్క్ చేసిన కారు

• దుండిగల్ లోని మరో ఘటనలో…

దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బహదూర్‌పల్లి, ఉదయ్‌గిరి కాలనీలో గురువారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. డెకరేషన్ సామగ్రి నిల్వ ఉంచిన గోదాంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఆ గోదాంలో ఉన్న సామగ్రి పూర్తిగా దగ్ధమైంది. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో గోదాం పక్కనే పార్క్ చేసిన ఒక కారు కూడా పూర్తిగా కాలిపోయింది. ఘటనతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అదృష్టవశాత్తూ ప్రాణనష్టం జరగలేదని ప్రాథమిక సమాచారం.

Leave A Reply

Your email address will not be published.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More