డివిజన్ల పునర్విభజనలో లోపాలు సరిచేయాలి: సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్

గాజులరామారం(న్యూస్ విధాత్రి), డిసెంబర్ 11: జిహెచ్ఎంసి డివిజన్ల పునర్విభజనలో తీవ్ర అన్యాయాలు, గందరగోళం చోటు చేసుకున్నాయని సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒకే బస్తికి చెందిన వీధులను విభిన్న డివిజన్లకు కేటాయించడం, ఒకే ఇంటి నెంబర్‌కి సంబంధించిన క్రమ సంఖ్యలు కూడా వేర్వేరు డివిజన్లలో చేర్చటం, ఒకే పిన్ కోడ్ ఉన్న ప్రాంతాలను ఇతర పిన్ కోడ్‌ డివిజన్లలో కలపడం ప్రజలకు తీవ్ర అయోమయం కలిగిస్తోందని ఆయన అన్నారు. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు పునర్విభజనలో జరిగిన తప్పిదాలను సరిదిద్దాలని కోరుతూ గాజులరామారం ఉప కమిషనర్ మల్లారెడ్డికి సిపిఐ నాయకులు గురువారం వినతిపత్రం అందజేశారు. ఒకే బస్తీలో ఉన్న అన్ని వీధులను ఒకే డివిజన్‌లో ఉంచే విధంగా స్పష్టమైన భౌగోళిక పద్ధతి అనుసరించాల్సిన అవసరం ఉందని వారు సూచించారు. జిహెచ్ఎంసి కమిషనర్‌ను కూడా త్వరలో కలిసి ఈ అంశంపై తమ అభిప్రాయాలను తెలియజేయనున్నట్టు ఉమా మహేష్ తెలిపారు. గతంలో జగద్గిరిగుట్టలోని మక్దుమ్ నగర్‌ ప్రాంతంలో ఉన్న అన్ని బస్తీలను ఒకే డివిజన్‌లో చేర్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా గాజులరామారం డివిజన్‌కు భౌగోళికంగా దూరంగా ఉన్న మిథిలా నగర్‌ను అక్కడి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి స్వామి, సహాయ కార్యదర్శి హరినాథ్ రావు, జగద్గిరిగుట్ట శాఖ కార్యదర్శి ఎం. సహదేవరెడ్డి, సీనియర్ నాయకులు సుంకిరెడ్డి, వంశీ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More