తెలంగాణ ఎక్సైజ్ శాఖకు జాతీయ స్థాయిలో గౌరవం
• ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ లో ప్రతిభ కనపరిచిన సిబ్బంది
కూకట్ పల్లి (న్యూస్ విధాత్రి), ఫిబ్రవరి 28: దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ – 2025-26 పోటీల్లో తెలంగాణ ఎక్సైజ్ శాఖ సిబ్బంది విశేష ప్రతిభ కనబరిచి రాష్ట్రానికి గౌరవం తీసుకొచ్చారు. ఫిబ్రవరి 26 నుండి 28 వరకు హిమాచల్ ప్రదేశ్ లోని పడ్డల్ స్టేడియం ఇండోర్ హాల్ లో డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ సర్వీసెస్ అండ్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి పోటీలు ఘనంగా జరిగాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల సివిల్ సర్వీసెస్ విభాగాలకు చెందిన ప్రతిభావంతులైన క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు.

√ రజత పతకాన్ని చేజిక్కించుకున్న శేఖర్…
కూకట్పల్లి ఎక్సైజ్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న ఎం. శేఖర్ పోటీల్లో అద్భుతమైన పోరాట పటిమను ప్రదర్శిస్తూ ఫైనల్ వరకు దూసుకెళ్లి రజత పతకాన్ని సాధించారు. విధుల ఒత్తిడిలోనూ క్రీడలపై ఉన్న నిబద్ధతతో దేశస్థాయిలో మెరిసి శాఖకు గర్వకారణంగా నిలిచారు.
√ కాంస్య పతకం కైవసం చేసుకున్న చరణ్…
అదే విధంగా ఎస్టీఎఫ్ హైదరాబాద్ విభాగానికి చెందిన కానిస్టేబుల్ చరణ్ తన ప్రదర్శనతో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఆయన పోరాట స్పూర్తి, పట్టుదల సహచరుల ప్రశంసలు అందుకుంది.
√ అధికారుల అభినందనలు…
దేశస్థాయిలో జరిగే సివిల్ సర్వీసెస్ క్రీడా పోటీల్లో తెలంగాణ ఎక్సైజ్ శాఖకు చెందిన సిబ్బంది విజయాలు సాధించడం గౌరవప్రదమైన విషయమని అధికారులు పేర్కొన్నారు. విధి నిర్వహణలో క్రమశిక్షణతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ చాటడం అభినందనీయమని అన్నారు. ఈ విజయాలతో రాష్ట్ర కీర్తిని జాతీయ వేదికపై మరోసారి చాటి చెప్పారని కొనియాడారు. విజేతలను ఉన్నతాధికారులు, సహచర సిబ్బంది అభినందిస్తూ భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో కూడా మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.