హైదరాబాద్ /కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), మే 16: మైనర్ బాలికపై వేధింపుల ఆరోపణలతో నమోదైన పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్‌ను సైబరాబాద్ పోలీసులు శనివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మేడ్చల్ కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి అతనికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. దీంతో అర్ధరాత్రి 12 గంటలకు ఆలస్యంగా అతనిని చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించారు.
ఈ నెల 8న పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన తర్వాత నుంచి భగీరథ్ కనిపించకుండా ఉండటంతో పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్‌కు ఊరట లభించకపోవడంతో కేసు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. భగీరథ్ విదేశాలకు వెళ్లే అవకాశముందనే అనుమానంతో పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేసి దేశంలోని విమానాశ్రయాలను అప్రమత్తం చేశారు. నిందితుడి కోసం ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి హైదరాబాద్, కరీంనగర్ ప్రాంతాల్లో ముమ్మరంగా గాలింపు చేపట్టారు. హైదరాబాద్ బంజారాహిల్స్ సాగర్ సొసైటీలోని కేంద్ర మంత్రి బండి సంజయ్ నివాసానికి సైతం పోలీసులు వెళ్లి తనిఖీలు చేపట్టడం రాజకీయంగా సంచలనం సృష్టించింది. నిందితుడి ఫోన్ స్విఛాఫ్ కావడంతో కాల్‌డేటా రికార్డులను విశ్లేషించిన పోలీసులు.. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, యూసుఫ్‌గూడల్లోని అతని స్నేహితుల ఇళ్లలో వెతికారు. కరీంనగర్‌లోని భగీరథ్ నివాసంతో పాటు అతని మేనమామ వంశీకృష్ణ ఇంటిలోనూ తనిఖీలు నిర్వహించారు.

శనివారం రాత్రి కేంద్ర మంత్రి బండి సంజయ్ తన కుమారుడిని చట్టాన్ని గౌరవిస్తూ పోలీసులకు అప్పగించినట్లు రాత్రి 8 గంటల సమయంలో ప్రకటన విడుదల చేశారు. అనంతరం పోలీసులు భగీరథ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. కొద్దిసేపటి తర్వాత రాత్రి 9 గంటలకు అతను న్యాయవాదులతో కలిసి 4 కార్ల కాన్వాయ్‌తో నేరుగా పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
స్టేషన్ వద్ద ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేసు పర్యవేక్షణాధికారిణి డీసీపీ రితిరాజ్ ప్రత్యక్షంగా విచారణను పర్యవేక్షించగా, మేడ్చల్ ఏసీపీ శంకర్‌రెడ్డి, ఇన్స్పెక్టర్ విజయ్‌వర్ధన్ తదితరులు చట్టపరమైన ప్రక్రియ పూర్తి చేశారు.
అనంతరం నిందితుడికి వైద్య పరీక్షలు నిర్వహించి మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. కోర్టు రిమాండ్ విధించడంతో అతనిని చర్లపల్లి జైలుకు తరలించారు.
ఇదిలా ఉండగా, బాధిత బాలికతో పాటు ఆమె తల్లి వాంగ్మూలాన్ని బిఎన్ఎస్ సెక్షన్ 183 ప్రకారం మేజిస్ట్రేట్ సమక్షంలో నమోదు చేశారు. ఈ ప్రక్రియను వీడియో రూపంలో రికార్డు చేసి భద్రపరిచారు. పోక్సో కేసుల్లో ఈ తరహా వాంగ్మూలాలు విచారణలో కీలక ఆధారాలుగా పరిగణించబడతాయని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు