ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జూలై 14: జిహెచ్ఎంసి కూకట్పల్లి జోన్ పరిధిలోని ప్రజా సమస్యల పరిష్కారానికై జోనల్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 9 ఫిర్యాదులు అందాయి. వీటిలో పట్టణ ప్రణాళిక విభాగానికి 2, ఇంజనీరింగ్ విభాగానికి 6, విద్యుత్ విభాగానికి ఒక ఫిర్యాదు అందాయి.

• కుత్బుల్లాపూర్, గాజులరామారం సర్కిల్ కార్యాలయాల్లో…
కుత్బుల్లాపూర్ సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 14 ఫిర్యాదులు అందాయి. వాటిలో ఇంజనీరింగ్ విభాగానికి 5 , పట్టణ ప్రణాళిక విభాగానికి 9 ఫిర్యాదులు అందాయి. అలాగే గాజులరామారం సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఇంజనీరింగ్ విభాగానికి 2 ఫిర్యాదులు అందాయి. ఈ కార్యక్రమంలో జంట సర్కిళ్ల ఉప కమిషనర్లు వి. నరసింహ, ఎల్ పి. మల్లారెడ్డి, వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
• అక్రమ రసాయన గోదాములను తొలగించాలి…
సుభాష్ నగర్ డివిజన్ లోని గంపల బస్తిలో ఇష్టానుసారం నిర్వహిస్తున్న అక్రమ రసాయన గోదాములను, రోడ్లను ఆక్రమించి నిలువ చేస్తున్న రసాయన డ్రమ్ములను వెంటనే తొలగించి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని డివిజన్ మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి డివిజన్ ప్రజలతో వచ్చి డిసి నర్సింహకు వినతి పత్రాన్ని అందజేశారు. గతంలో పలుమార్లు ఫిర్యాదు చేసిన తూతూ మంత్రంగా చర్యలు తీసుకొని వదిలేస్తున్నారని, సదరు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. దీనికి స్పందించిన డిసి మంగళవారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి రసాయన డ్రమ్ములతో పాటు అక్రమ షెడ్లను కూడా తొలగిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఫాక్స్ సాగర్ చెరువు వద్ద ఉన్న సాయిబాబా ఆలయం సమీపంలో అక్రమంగా షెడ్లను ఏర్పాటు చేసి పరిశ్రమలు నిర్వహిస్తున్నారని వాటి వల్ల శబ్ద కాలుష్యం ఎక్కువగా వస్తుందని స్థానిక మహిళలు ఫిర్యాదు చేశారు.