బాచుపల్లిలో మరోసారి భారీ అగ్నిప్రమాదం

• అర్ధరాత్రి సంఘటన…స్థానికుల్లో ఆందోళన
• భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం
నిజాంపేట (న్యూస్ విధాత్రి), మే 5: బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రగతి నగర్ కమాన్ నుంచి బాచుపల్లి వెళ్లే ప్రధాన రహదారిపై సోమవారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అర్ధరాత్రి సమయానికి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. స్థానికుల సమాచారం మేరకు… ప్రధాన రహదారి పక్కన వరుసగా ఉన్న ఫర్నిచర్ దుకాణాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సదరు దుకాణాల్లో తలుపులు, కిటికీలు, బల్లలు వంటి కలప తో పాటు సోఫాలు, ఇతరత్రా వస్తువులు విక్రయిస్తుంటారు. ఇవన్నీ వేగంగా మండే వస్తువులు కావడంతో మంటలు ఏకకాలంలో వరుస దుకాణాలకు వేగంగా వ్యాపించాయి. మంటలు ఎత్తుగా ఎగసిపడుతూ సమీప ప్రాంతాలకు దట్టమైన పొగ వ్యాపించడం వల్ల ప్రజలు వెంటనే అప్రమత్తమయ్యారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి తీవ్రంగా శ్రమించారు. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం జరగగా, ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణం తెలియాల్సి ఉంది. షార్ట్ సర్క్యూట్ లేదా నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఇదే ప్రాంతంలో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడం గమనార్హం. తక్కువ కాల వ్యవధిలోనే మళ్లీ ఇదే ప్రాంతంలో అగ్ని ప్రమాదం సంభవించడం స్థానికుల్లో భయాన్ని పెంచింది. వరుస ఘటనలపై అధికారులు దృష్టి సారించి, కారణాలను లోతుగా పరిశీలించాలని ప్రజలు కోరుతున్నారు. అగ్నిమాపక విభాగం, పోలీసు అధికారులు సంయుక్తంగా ఘటనపై విచారణ చేపట్టారు. .

Leave A Reply

Your email address will not be published.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More