కుత్బుల్లాపూర్‌లో ఘనంగా ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక సమావేశం
పేట్ బషీరాబాద్ (న్యూస్ విధాత్రి), మే 2: కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని కొంపల్లిలో కేవిఆర్ ఫంక్షన్ హాల్లో ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం వైభవంగా నిర్వహించబడింది. ముఖ్య అతిథిగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేయగా కార్యక్రమం ప్రారంభమై, తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’తో సభ కొనసాగింది. ముఖ్యమంత్రి సందేశాన్ని సభకు తెలియజేశారు. ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలోని 10 ముఖ్య ఉద్దేశ్యాలను అధికారులు సవివరంగా వివరించారు. ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, సంక్షేమం, మహిళా–శిశు అభివృద్ధి, విద్యుత్, రేషన్ కార్డులు, పెన్షన్లు, గ్యాస్, ‘అరైవ్-అలైవ్ ’ వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. నిరుపేదలకు సొంతింటి కలను నెరవేర్చే ‘ఇందిరమ్మ ఇళ్లు’ పథకాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల వరకు నగదు రహిత (క్యాష్‌లెస్) వైద్య చికిత్స అందించే కార్యక్రమాన్ని కూడా వెల్లడించారు. విద్యార్థుల పోషకాహారానికి భాగంగా ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు పాలు, రాగిజావ అందించనున్నట్లు ప్రకటించారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్లో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు. మైనారిటీ లబ్ధిదారులకు ఆస్తుల పంపిణీ, మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ చేపట్టారు. వివిధ శాఖల స్టాల్స్ ఏర్పాటు చేసి ప్రభుత్వ పథకాలను ప్రదర్శించారు.

ఈ సందర్భంగా హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ… ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువస్తున్నాయని తెలిపారు. పేదలు, రైతులు, మహిళలు, యువత, మైనారిటీల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. మైనారిటీ వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోందని, యువతకు ఉచిత స్కూటీలు, మహిళలకు ఉచిత కుట్టుమిషన్లు అందిస్తూ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో సుమారు 400 ఉచిత కుట్టుమిషన్లు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని పరిష్కరించడమే ప్రజా పాలన లక్ష్యమని, ప్రతి అర్హుడికి ప్రభుత్వ పథకాలు అందేలా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, వివిధ శాఖల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.