బీసీల రాజ్యా సాదనే లక్ష్యంగా బీసీ కవులు కళాకారులు ఏకం కావాలి 

• తెలంగాణలో  వచ్చేది బీసీల రాజ్యమే

• బీసీ కల్చరల్ ఫోరం నూతన కార్యవర్గం ఎన్నిక

• రాష్ట్ర అధ్యక్షులుగా వరంగల్ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా దరువు అంజన్న

కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జూలై 29 :  ప్రపంచ చరిత్రలో సాంస్కృతిక ఉద్యమం లేకుండా ఏ ఉద్యమం విజయవంతం కాలేదని, నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నుంచి  నేటి తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమం వరకు కవులు, కళాకారులు, రచయితలు సాంస్కృతిక  సేనగా ఏర్పడి ఉద్యమిస్తేనే ఉద్యమాలు విజయం సాధించాయని, ఇప్పుడు తెలంగాణలో జరిగే బీసీల రాజకీయ పోరాటానికి సాంస్కృతిక ఉద్యమం తోడు అయితే ఇక వచ్చేది బీసీల రాజ్యమేనని, దానిని ఎవరు ఆపలేరని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రముఖ కవులు, కళాకారులు తరలివచ్చి బిసి కల్చరల్ ఫోరం వేదికను ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి జాజుల శ్రీనివాస్ గౌడ్ తో పాటు మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరావత్ అనిల్, మహాత్మ జ్యోతిబా పూలే జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ చిన్న శ్రీశైలం యాదవులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.  ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఇప్పటివరకు రాష్ట్రంలోని బీసీ కళాకారులు, కవులు సామాజిక దోపిడీ అసమానతలపై, అలాగే ప్రాంతీయ వివక్ష పై తమ కలం, గళం వినిపించి పోరాడారన్నారు. దీనితో తెలంగాణలో సామాజిక, రాజకీయ చైతన్యంతో పాటు ప్రత్యేక రాష్ట్ర సాధన కూడా జరిగిందని, ఇప్పుడు తెలంగాణలో బీసీలకు జరుగుతున్న అన్యాయంపై, అలాగే బీసీలకు రాజకీయ అధికారం కోసం మరో మారు కవులు, కళాకారులు తమ కలం తో పాటు గళాన్నీ వినిపించి,  ఓటు చైతన్యంతో బీసీలను రాజకీయ చైతన్యంగా మార్చి భావితరాలకు బీసీల రాజకీయ అధికారానికి బాటలు వేయాలని ఆయన పిలుపునిచ్చారు.

బీసీ కల్చరల్ ఫోరం నూతన కార్యవర్గం

పార్టీ జెండాలను, ఎజెండాలను పక్కకు పెట్టి బీసీ కవులు, కళాకారులు అంతా ఏకధాటిగా ముందుకు వచ్చి బీసీల భావజాల వ్యాప్తినీ పల్లె పల్లెకు తీసుకెళ్లి బీసీ ఉద్యమ చరిత్రను తిరగరాయాలని, బీసీల రాజకీయ పోరాటంలో కోట్లాది మందిని భాగస్వామ్యం చేయాలని కళాకారులకు జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు.  మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరావత్ అనిల్ కుమార్ మాట్లాడుతూ బీసీ కళాకారులు ఏకం కావడం చాలా అభినందనీయమని, దేశ వ్యాప్తంగా కూడా బీసీల వాణి బలంగా వినపడుతున్న ఈ క్రమంలో దీనికి తోడు బీసీ కళాకారులు ఒక్కటే తమ రచనలు,  పాటలు, ధూంధాంల ద్వారా బీసీల రాజకీయ చైతన్యాన్ని రగిలించాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా కాకుండా ఒక బీసీ బిడ్డగా ఈ సమావేశానికి హాజరయ్యానని, బీసీల ఐక్యత కోసం కళాకారులు కృషి చేస్తే వారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని, దేశంలో, రాష్ట్రంలో బీసీలకు మంచి రోజులు రానున్నాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. బీసీల ఐక్యతకు తనవంతుగా కృషి చేస్తూ బీసీ రిజర్వేషన్ల ఆమోదానికి రాహుల్ గాంధీ కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు.

అనంతరం బీసీ కల్చరల్ ఫోరం నూతన కార్యవర్గాన్ని  జాజుల శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు. నూతన కార్యవర్గ రాష్ట్ర అధ్యక్షులుగా వరంగల్ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా దరువు అంజన్న, రాష్ట్ర కార్య నిర్వాహక అధ్యక్షులుగా కోదారి శ్రీను, ఉపాధ్యక్షులుగా అభినయ శ్రీనివాస్, అంబటి వెంకన్న, కోశాధికారిగా  బీసీ రామలింగం, సంయుక్త కార్యదర్శులుగా మళ్లీక్ తేజ, బుర్ర సతీష్, ప్రకాష్,  ప్రచార కార్యదర్శులుగా పొద్దు పోడుపు శంకర్, రాచకొండ రమేష్, రాచకొండ రంగన్న, సాంస్కృతిక కార్యదర్శులుగా వడ్లకొండ అనిల్, జడల రమేష్, జీ వై కృష్ణ, సహాయ కార్యదర్శులుగా మధుప్రియ, మామిళ్ళ మౌనిక, పరకాల అజయ్, సిద్దిపేట శ్రీనివాస్, ఐల నరసింహ స్వామి, సలహా దారులుగా మోహన్ బైరాగి, ఐలా నరసింహ చారి, సిద్దిపేట శ్రీనివాస్, ఒగ్గు రవి, జనగామ సోమేశ్వర్, చారీ, యోచన, ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా నక్క శ్రీకాంత్, రాంసాగర్ లక్ష్మణ్, ముకుంద, పద్మావతి,  స్వామి డప్పు, సంబరాల బాలు, కందుకూరి బ్రహ్మ చారీ, ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సమావేశంలో బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి, శేఖర్ సగర, కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, విక్రమ్ గౌడ్, శ్యాం కుర్మా, తారకేశ్వరి, సుజాత, తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More