వెంచర్ ప్రైవేటుది… రోడ్డు స్థలం ప్రభుత్వానిది…!
• భౌరంపేట సర్వే నెంబర్ 166 ప్రభుత్వ స్థలంలో నిర్వాకం
• వెంచర్ నిర్వాహకులకు అధికార పార్టీ అండదండలు
• పట్టింపు లేని రెవెన్యూ, మున్సిపల్ అధికారులు
దుండిగల్ (న్యూస్ విధాత్రి), జూలై 30: ప్రజల నివసించే ప్రాంతాల్లో ప్రధాన, అంతర్గత రహదారుల మరమ్మత్తులు, నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే రహదారులను విస్తరణలో మీనమేషాలు లెక్కించే అధికారులు ఓ ప్రైవేటు వెంచర్ కోసం ఏకంగా ప్రభుత్వ స్థలాన్ని ధారా దత్తం చేసి అక్రమ రోడ్డు విస్తరణకు లైన్ క్లియర్ చేసారంటేనే వారి చిత్తశుద్ధిని ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ప్రజావసరాలు పట్టని అధికారులు భారీ వెంచర్లకు, బడా బాబులకు మాత్రం వత్తాసు పలుకుతూ ప్రభుత్వ ఆస్తులను సైతం కొల్లగొట్టే స్థాయికి సహకరిస్తున్నారు. మరి ఏ స్థాయి సిఫార్సులో లేక ఆమ్యామ్యాలా ఫలితమో కానీ ప్రైవేటు వెంచర్ కు ప్రభుత్వ స్థలంలో ఉన్న బండి బాటను సైతం 40 అడుగులకు విస్తరించి సిసి రోడ్డు పనులు చకచకా సాగిస్తున్న అడ్డుకునే నాధుడే కరువయ్యాడని స్థానికులు మండిపడుతున్నారు.
దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట సర్వే నెంబర్ 166/1, 166/3 ప్రభుత్వ స్థలంలో ఓ ప్రైవేటు వెంచర్ కోసం బండిబాటగా ఉన్న రోడ్డును 40 అడుగులకు విస్తరించి నిర్మించుకునేందుకు ప్రభుత్వ స్థలాన్ని అటు రెవెన్యూ, ఇటు మున్సిపల్ అధికారులు బడా వెంచర్ సంస్థకు ఎటువంటి అనుమతులు లేకుండానే కట్టబెట్టారు. అధికారులు అప్పనంగా కట్టబట్టడమే తడవుగా వెంచర్ నిర్వాహకులు ఆగమేఘాలపై రోడ్డు నిర్మాణ పనులను చకచక కానిస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్డును ఆనుకొని ఉన్న సిల్వర్ ఓక్స్ పాఠశాల నుంచి సర్వేనెంబర్ 166 మీదుగా సుమారు కిలోమీటర్ మేరకు రోడ్డు విస్తరణ పనులతో పాటు సిసి రోడ్డు నిర్మాణాన్ని రెట్టింపు వేగంతో పూర్తి చేస్తున్నారు. ప్రభుత్వ స్థలంలో ఇంత తంతు జరుగుతున్న ఆదిశగా కన్నెత్తి కూడా చూడని రెవెన్యూ, మున్సిపల్ అధికారుల తీరుపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సదరు వెంచర్ నిర్వాహకులకు అధికార పార్టీ నాయకుల అండదండలు పుష్కలంగా ఉన్నాయని వాదన బలంగానే వినిపిస్తుంది.

• పశువుల కొట్టం సరే… మరి రోడ్డు సంగతేంటి..?
అదే సర్వేనెంబర్ 166 లో గత ఫిబ్రవరి నెలలో రైతులు పశువుల కొట్టం వేసుకుంటే ప్రభుత్వ స్థలమని తహసిల్దార్ కార్యాలయం నుంచి నోటీసులు ఇచ్చి దానిని కూల్చివేశారు. మరి అదే సర్వే నెంబర్ లో ప్రస్తుతం ప్రవేట్ వెంచర్ కోసం ఎటువంటి అనుమతులు లేకుండా రహదారి నిర్మాణానికి పూనుకుంటే సంబంధిత అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారని స్థానిక రైతులు మండిపడుతున్నారు. రైతులకు ఒక న్యాయం, బడా బాబులకు మరో న్యాయమా.. అని వారు ప్రశ్నిస్తున్నారు. సదరు రోడ్డు నిర్మాణంపై సంబంధిత శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకొని ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని వారు కోరుతున్నారు.