స్థానిక సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రజలు సమన్వయంతో పని చేయాలి
• రంగానగర్లో క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించిన సిఎంసి కమిషనర్ సృజన
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జూన్ 22: స్థానిక సమస్యల పరిష్కారానికి అధికారులు, ప్రజలు సమన్వయంతో పనిచేస్తే పరిశుభ్రమైన, మెరుగైన నగర వాతావరణాన్ని సాధించవచ్చని సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన సూచించారు. చింతల్ సర్కిల్ పరిధిలోని రంగానగర్ ప్రాంతంలో ఆమె అధికారులతో కలిసి సోమవారం క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించారు.

ఈ మేరకు స్థానిక నివాసితులు, సంక్షేమ సంఘాల ప్రతినిధులు (ఆర్డబ్ల్యూఏ), వ్యాపారులుతో సమావేశమై ప్రాంతంలోని పౌర సమస్యలను ప్రత్యక్షంగా ఆమె పరిశీలించారు. రహదారుల మరమ్మత్తు పనులు, ఆక్రమణల తొలగింపును ప్రాధాన్యతగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అలాగే పలు ప్రాంతాల్లో నీటి నిల్వలు గుర్తించిన ఆమె ఆయా ప్రాంతాల్లో వెంటనే చర్యలు తీసుకుని సమస్యను పరిష్కరించాలని సూచించారు. పట్టణ ప్రణాళిక, మెయింటెనెన్స్ విభాగాల బృందాలు అత్యవసరంగా క్షేత్రస్థాయిలో జోక్యం చేసుకుని సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

పరిశుభ్రత విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ చెత్త బుట్టలను ఏర్పాటు చేసుకుని వ్యర్థాల నిర్వహణను సక్రమంగా నిర్వహిస్తున్న పౌరులు, వ్యాపారులను కమిషనర్ అభినందించారు. వాణిజ్య ప్రాంతాల్లో పరిశుభ్రతను పెంపొందించేందుకు ఘన వ్యర్థాల నిర్వహణ (ఎస్ డబ్ల్యు ఎం) విభాగం చేపడుతున్న “నో బిన్ – నో ట్రేడ్” అవగాహన కార్యక్రమాన్ని ప్రశంసించారు. రోడ్ల పక్కన చెత్త వేయకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, ఇంటింటికీ చెత్త సేకరణ కోసం వచ్చే సాట్ ఆటోల సేవలను వినియోగించాలని సూచించారు. అలాగే సాట్ ఆపరేటర్ నిర్ణయించిన మేరకు గరిష్ఠంగా రూ.100 మాత్రమే వినియోగదారుల రుసుము వసూలు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో చింతల సర్కిల్ డిసి స్పందన, ఇంజనీరింగ్, పారిశుద్ధ్య విభాగాల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.