ఆడుకోవడానికి వెళ్లి… అనంత లోకాలకు…
• నీటి గుంటలో జారిపడి బాలుడు మృతి
• దూలపల్లి ఫారెస్ట్ అకాడమీలో ఘటన
పేట్ బషీరాబాద్ (న్యూస్ విధాత్రి), ఏప్రిల్ 5: స్నేహితులతో ఆటలాడుకుంటూ ప్రమాదవశాత్తు నీటి గుంటలో జారిపడి ఓ బాలుడు మృతి చెందిన విషాదకర ఘటన పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… దూలపల్లి గ్రామానికి చెందిన ముగ్గురు బాలురు దూలపల్లి ఫారెస్ట్ అకాడమీ పరిధిలోని కీర్తివనం ప్రాంతంలో ఆడుకోవడానికి వెళ్లారు. వారు అక్కడ ఉన్న నీరు నిల్వ ఉన్న కుంట వద్ద ఆడుకుంటుండగా, దూలపల్లి గ్రామానికి చెందిన సాంబారావు కుమారుడు నరేష్ (13) అనే బాలుడు అనుకోకుండా జారి నీటిలో పడిపోయాడు. నరేష్ జీడిమెట్లలోని శాంతినికేతన్ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు.

నరేష్ నీటిలో పడిపోవడాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్ సహాయంతో బాలుడిని సమీపంలోని సిఎంఆర్ ఆసుపత్రికి తరలించారు. అయితే, బాలుడిని పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది. బాలుడి మృతి పట్ల గ్రామస్థులు, కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.