జీడిమెట్లలో బంగ్లాదేశీయుల అక్రమ మకాం బట్టబయలు..
• ఏడుగురు అరెస్ట్..డిపోర్టేషన్ కేంద్రానికి తరలింపు
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జూన్ 13: నగరంలో అక్రమంగా నివసిస్తున్న విదేశీయులపై పోలీసులు చేపడుతున్న ప్రత్యేక తనిఖీలలో భాగంగా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఏడుగురు బంగ్లాదేశ్ జాతీయులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం, నిఘా వర్గాల హెచ్చరికల ఆధారంగా ఈ ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాజులరామారంలోని హెచ్ఏఎల్ ప్రాంతంలో ఉన్న ఓ అద్దె ఇంట్లో కొంతమంది బంగ్లాదేశ్ పౌరులు అక్రమంగా నివసిస్తున్నట్లు సమాచారం అందింది. ఈ సమాచారంపై వెంటనే స్పందించిన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో గడ్డం మల్లేష్ తన బృందంతో కలిసి ఆ ఇంటిపై శనివారం సోదాలు నిర్వహించారు. సోదాల సమయంలో అక్కడ నివసిస్తున్న ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా, వారిలో ఎవరి వద్ద భారతదేశంలో చట్టబద్ధంగా నివసించేందుకు అవసరమైన పాస్‌పోర్టులు, వీసాలు లేదా ఇతర ప్రయాణ పత్రాలు లేవని తేలింది. ప్రాథమిక దర్యాప్తులో వారు అక్రమ మార్గాల ద్వారా భారతదేశంలోకి ప్రవేశించి దేశంలోని వివిధ ప్రాంతాల్లో చట్టవిరుద్ధంగా నివసిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో కుత్బుల్లాపూర్ జోన్ డీసీపీ ఎన్. కోటి రెడ్డి పర్యవేక్షణలో సంబంధిత చట్టాల ప్రకారం నిర్బంధ, కదలికల నియంత్రణ ఉత్తర్వులు జారీ చేశారు.
అనంతరం వారిని మెదక్ జిల్లా జోగిపేటలోని డిపోర్టేషన్ కేంద్రానికి తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. నిర్దేశిత చట్టపరమైన విధానాల ప్రకారం వారి బహిష్కరణ ప్రక్రియ ప్రారంభించబడిందని, సంబంధిత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాల ధృవీకరణ పూర్తయిన అనంతరం వారిని బంగ్లాదేశ్‌కు పంపించే చర్యలు చేపట్టనున్నట్లు పోలీసులు వెల్లడించారు. నగర భద్రత, జాతీయ భద్రత దృష్ట్యా అక్రమంగా నివసిస్తున్న విదేశీయులపై తనిఖీలు కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు. ఈ ప్రత్యేక ఆపరేషన్‌లో జీడిమెట్ల పోలీసులతో పాటు ఎస్ఓటీ కూకట్పల్లి జోన్ సిబ్బంది కూడా పాల్గొని కీలక పాత్ర పోషించారు.