దత్తాత్రేయ నగర్ బస్తీ దవాఖానా పునః ప్రారంభించాలి
• ఒక రోజు శాంతియుత నిరాహార దీక్ష చేపట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు నర్సింగోజు వివేకానంద
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జనవరి 18:
దత్తాత్రేయ నగర్ బస్తీ దవాఖానా మూసివేయడంతో పేదలు, వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, ఆమ్ ఆద్మీ పార్టీ పద్మా నగర్ డివిజన్ (285వ వార్డు) నాయకుడు నర్సింగోజు వివేకానంద ఆధ్వర్యంలో ఆదివారం శాంతియుత ఒక రోజు నిరాహార దీక్ష నిర్వహించారు.

పద్మానగర్ ఫేజ్ -2 రింగ్ రోడ్డు వద్ద ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగిన ఈ నిరాహార దీక్షలో స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సంఘీభావం తెలిపారు. బస్తీ దవాఖానా మూసివేత కారణంగా స్థానిక ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులపై ఆధారపడాల్సి వస్తోందని, ఇది పేద కుటుంబాలపై తీవ్ర ఆర్థిక భారం మోపుతోందని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాథమిక ఆరోగ్య హక్కును కాపాడాలంటే బస్తీ దవాఖానాను వెంటనే పునఃప్రారంభించాల్సిందేనని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జిహెచ్ఎంసి, వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా యంత్రాంగం తక్షణమే స్పందించి బస్తీ దవాఖానాను తిరిగి ప్రారంభించాలని కోరారు. ప్రజల ఆరోగ్య హక్కు కోసం నిర్వహించిన ఈ శాంతియుత ఒక రోజు నిరాహార దీక్షను సాయంత్రం విజయవంతంగా విరమించారు. ఈ దీక్షకు మద్దతు తెలిపిన స్థానిక ప్రజలు, నాయకులు, సామాజిక కార్యకర్తలు, మీడియా ప్రతినిధులు మరియు పోలీస్ శాఖకు వివేకానంద హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి దత్తాత్రేయ నగర్ బస్తీ దవాఖానాను తిరిగి ప్రారంభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలపై స్పందన లేకపోతే భవిష్యత్తులో ప్రజాస్వామ్యబద్ధమైన ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి బుర్ర రాము గౌడ్, నాయకులు రామ్మూర్తి చారి, రాజ్ కుమార్, తిరుమలేష్, బాల కిషన్, శ్రావణి చారి, రన్వీత్ గుప్తా, శ్రవణ్, బోస్, లియాకత్, దత్తాత్రేయ నగర్ బస్తివాసులు పాల్గొని సంఘీభావం తెలిపారు.