పదవ తరగతి ఫలితాల్లో నేతాజీ హై స్కూల్ విద్యార్థుల సత్తా
– అత్యుత్తమ ఫలితాలతో విజయడంకా
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), ఏప్రిల్ 29: బుధవారం విడుదలైన పదవ తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాల్లో కుత్బుల్లాపూర్ మండలంలోని నేతాజీ హై స్కూల్ విద్యార్థులు విశిష్ట ప్రతిభ కనబరిచి పాఠశాలకు కీర్తి ప్రతిష్ఠలు తెచ్చారు. పాఠశాల విద్యార్థులు భారీ సంఖ్యలో అధిక మార్కులు సాధించడం ద్వారా ఈ విద్యాసంస్థ మరోసారి తన ప్రతిభను చాటుకుంది. ఈ ఫలితాల్లో సాక్షిపాల్ 572 మార్కులతో పాఠశాలలో ప్రథమ స్థానం సాధించి అందరి ప్రశంసలు అందుకుంది. ఆమె తరువాత అనీషా 556 మార్కులు సాధించి ద్వితీయ స్థానంలో నిలిచింది. విఘ్నేష్, ఆదిత్య తలా 554 మార్కులు సాధించి మూడవ స్థానాన్ని పంచుకోగా, యశోద 552 మార్కులు, గణ సింధు 551 మార్కులు సాధించి తమ ప్రతిభను నిరూపించారు.
మొత్తం ఫలితాల్లో సుమారు 55 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించడం గమనార్హం. ఇది పాఠశాల విద్యా ప్రమాణాలు ఎంత ఉన్నతంగా ఉన్నాయో తెలియజేస్తోంది. విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం కలిసి ఈ విజయాన్ని సాధ్యం చేశాయని విద్యా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ విజయంపై పాఠశాల ప్రిన్సిపాల్ సిహెచ్. మహేష్ కుమార్, అకాడమిక్ డైరెక్టర్ సి హెచ్. నందిని హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులు సాధించిన ఈ ఫలితాలు పాఠశాలకు గర్వకారణమని తెలిపారు. ఉపాధ్యాయుల నిరంతర శ్రమ, విద్యార్థుల పట్టుదల, తల్లిదండ్రుల సహకారం వల్లే ఈ విజయాన్ని సాధించగలిగామని వారు పేర్కొన్నారు. విద్యార్థులు ఇలాగే భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆశిస్తూ, పాఠశాల యాజమాన్యం వారికి అభినందనలు తెలియజేసింది.