అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానజ్యోతిని వెలిగించే వ్యక్తే సద్గురువు – పద్మశ్రీ గరికపాటి నరసింహారావు

• గురు పూర్ణిమ సందర్భంగా శ్రీ సాయిరాం మందిరంలో ఆధ్యాత్మిక ప్రవచనం
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జూలై 29:  గురు పూర్ణిమను పురస్కరించుకొని కుత్బుల్లాపూర్ లోని పద్మానగర్ ఫేజ్-2లో ఉన్న శ్రీ సాయిరాం మందిరంలో బుధవారం ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఆలయ ధర్మకర్తలు నల్లపాటి వెంకటేశ్వరరావు, రాజేశ్వరి దంపతుల ఆధ్వర్యంలో మహాసహస్రావధాని, పద్మశ్రీ అవార్డు గ్రహీత డా. గరికపాటి నరసింహారావు పాల్గొన్న ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు, సాయి భక్తులు, స్థానిక ప్రజలు హాజరై ప్రవచనాన్ని ఆసక్తిగా ఆలకించారు.

గరికపాటి నరసింహారావు దంపతులను సన్మానిస్తున్న నల్లపాటి వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులు

కార్యక్రమంలో మాట్లాడిన డా. గరికపాటి నరసింహారావు గురువు స్థానం భారతీయ సంస్కృతిలో అత్యున్నతమైనదని పేర్కొన్నారు. అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానజ్యోతిని వెలిగించే వ్యక్తే సద్గురువని, గురువు చూపిన మార్గంలో నడిచినప్పుడే వ్యక్తిత్వ వికాసంతో పాటు ఆధ్యాత్మిక పురోగతి సాధ్యమవుతుందని వివరించారు. గురు పూర్ణిమ విశిష్టతను వివరిస్తూ మహర్షి వేదవ్యాసుని స్మరణతో ఈ పర్వదినాన్ని జరుపుకోవడం వెనుక ఉన్న ఆధ్యాత్మిక భావాన్ని ఆయన వివరించారు. గురువును భక్తి, వినయం, విశ్వాసంతో సేవించడం భారతీయ సంప్రదాయంలో అత్యున్నత ధర్మమని పేర్కొన్నారు. సద్గురువు సన్నిధి మనిషి జీవితానికి దిశానిర్దేశం చేస్తుందని, ధర్మబద్ధమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు. సనాతన ధర్మంలోని విశిష్టతలను వివరిస్తూ, అది కేవలం ఒక మతం కాదని, సమస్త మానవాళికి శాంతి, సహనం, కరుణ, సేవ, నైతిక విలువలను బోధించే జీవన విధానమని చెప్పారు. భారతీయ సంస్కృతి, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు అందించే జీవన సందేశాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. ప్రవచనం అంతటా ఆధ్యాత్మిక విశేషాలు, శాస్త్రోక్త ఉదాహరణలు, జీవితానికి ఉపయుక్తమైన సందేశాలతో డా. గరికపాటి భక్తులను ఆకట్టుకున్నారు. భక్తులు భక్తిశ్రద్ధలతో ప్రవచనాన్ని ఆలకించి గురుపూర్ణిమ వేడుకల్లో పాల్గొన్నారు. అంతకుముందు తెల్లవారుజామున 5 గంటల నుంచి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలతో పాటు వివిధ రకాల విశేష పూజలు, హారతులు నిర్వహించారు. మధ్యాహ్నం భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయా కార్యక్రమాలు విజయవంతం కావడానికి సహకరించిన భక్తులకు ఆలయ ధర్మకర్తలు నల్లపాటి వెంకటేశ్వరరావు, రాజేశ్వరి దంపతులు కృతజ్ఞతలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More