బిజెపి మేడ్చల్ మల్కాజ్గిరి అర్బన్ జిల్లా అధ్యక్షుడిగా డి. గిరివర్ధన్ రెడ్డి నియామకం
• హర్షం వ్యక్తం చేసిన మాజీ కార్పొరేటర్ విజయలక్ష్మి సుబ్బారావు
నిజాంపేట (న్యూస్ విధాత్రి), ఆగస్టు 5: మేడ్చల్–మల్కాజ్గిరి అర్బన్ జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా డి. గిరివర్ధన్ రెడ్డి నియమితులవడం పట్ల మాజీ కార్పొరేటర్ విజయలక్ష్మి సుబ్బారావు హర్షం వ్యక్తం చేస్తూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..విద్యార్థి దశలోనే అఖిల భారత విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) హోల్‌టైమర్‌గా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో సేవలందించిన డి. గిరివర్ధన్ రెడ్డి, అనంతరం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పరివార్ వివిధ క్షేత్రాల్లో సమర్థవంతంగా పనిచేశారని పేర్కొన్నారు. అలాగే భాగ్యనగర్ గణేష్ ఉత్సవ్ సమితి జిల్లా కన్వీనర్‌గా విశేష సేవలందించడంతో పాటు, బిజెపి మేడ్చల్–మల్కాజ్గిరి అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పార్టీ బలోపేతానికి కృషి చేశారని కొనియాడారు.
మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో పార్టీ కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉంటూ, యువతకు, ఉత్సాహవంతులైన కార్యకర్తలకు మార్గదర్శకత్వం వహిస్తూ ప్రోత్సాహం అందించిన నాయకుడిగా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారని పేర్కొన్నారు. జిల్లా అధ్యక్షుడిగా ఆయన నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం కావడంతో పాటు, ప్రజా సమస్యలపై సమర్థవంతంగా పోరాడుతూ జిల్లా అభివృద్ధికి విశేష కృషి చేస్తారనే పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. పార్టీ శ్రేణులతో కలిసి విజయవంతమైన నాయకత్వాన్ని అందించాలని ఆకాంక్షించారు.