ఓటరు జాబితా పటిష్టతకు క్షేత్రస్థాయిలో కృషి చేయాలి : ఈఆర్వో పింకేష్ కుమార్
• ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)పై బీఎల్వో సూపర్వైజర్లకు అవగాహన సమావేశం
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జూన్ 16: కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో చేపడుతున్న ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంపై బీఎల్వో సూపర్వైజర్లకు అవగాహన కల్పించేందుకు కుత్బుల్లాపూర్ జోన్ జెడ్సి, ఈఆర్వో పింకేష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం మంగళవారం నిర్వహించారు. హెచ్ఎంటి కాలనీలోని వ్యాక్సన్ పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో నియోజకవర్గ పరిధిలోని ఏఈఆర్వోలు, బిఎల్వో సూపర్వైజర్లు, ఎన్నికల శాఖ అధికారులు, మాస్టర్ ట్రైనర్లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఈఆర్వో ప్రధానంగా ప్రత్యేక సమగ్ర సవరణ అమలు విధానం, ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రక్రియ, దరఖాస్తుల పరిశీలన, నివేదికల సమర్పణ తదితర అంశాలపై అధికారులకు, సూపర్వైజర్లకు వివరంగా అవగాహన కల్పించారు. ఓటరు జాబితాలను పూర్తిస్థాయిలో పరిశీలించి తప్పులు, లోపాలను సరిదిద్దేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. బిఎల్వోలు ఎన్యుమరేషన్ ఫారంలను ప్రతి ఒక్క ఓటర్ కు ఇచ్చి వాటిని పూర్తి చేసిన తర్వాత తప్పక తిరిగి తీసుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ ప్రక్రియను ఈనెల 25వ తేదీ నుంచి జూలై 24వ తేదీ వరకు పూర్తి చేయాలని తెలిపారు. ఇచ్చిప్రతి పౌరుడు ఓటరు జాబితాలో నమోదయ్యేలా చూడటంతో పాటు, అనర్హులు, మరణించిన వారు లేదా ఇతర ప్రాంతాలకు మారిన వారి పేర్లను నిబంధనల మేరకు తొలగించే ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. బీఎల్వోలు ఇంటింటి సర్వే నిర్వహించి ఓటర్ల వివరాలను ధృవీకరించాలని, ప్రతి దరఖాస్తును నిశితంగా పరిశీలించి ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫీల్డ్ స్థాయిలో ఎదురయ్యే సమస్యలను వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రజలకు ఓటరు నమోదు, మార్పులు, తొలగింపుల ప్రక్రియపై అవగాహన కల్పించి, అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రోత్సహించాలని సూచించారు. ఎన్నికల వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఈఆర్వో పేర్కొన్నారు. అనంతరం పలువురు సూపర్వైజర్లు అడిగిన సందేహాలను ఈఆర్వో నివృత్తి చేశారు.