చలాన్ల కంటే చైతన్యమే చాలా ప్రభావవంతం
• హెల్మెట్ లేని ద్విచక్ర వాహనదారులకు జీడిమెట్ల పోలీసుల వినూత్న అవగాహన
• జీడిమెట్ల పిఎస్ పరిధిలో ప్రత్యేక డ్రైవ్
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), అక్టోబర్ 6: జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు వినూత్న అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హెల్మెట్ లేకుండా ద్విచక్రవాహనాలు నడుపుతున్న వారిపై ప్రత్యేక డ్రైవ్ ను సోమవారం చేపట్టారు. సాధారణంగా హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడిపే వారిని ఆపి చలాన్లు వేయడం సర్వసాధారణం. కానీ… జీడిమెట్ల సిఐ గడ్డం మల్లేష్ ఆధ్వర్యంలో పోలీసులు ఒక కొత్త పద్ధతిని అనుసరించారు. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడిపే వారిని ఆపి వారికి అవగాహన కల్పించి, వారి మొబైల్ ఫోన్‌లోనే “నేను హెల్మెట్ లేకుండా ప్రయాణించడం వల్ల నన్ను పోలీసులు పట్టుకున్నారు. ఇది నా మంచి కోసం, భవిష్యత్తులో ప్రమాదం జరగకుండా ఉద్దేశించబడింది. ఇకపై ఇలాంటి తప్పు చేయను.” అనే సందేశాన్ని స్టేటస్‌గా పెట్టేలా చేశారు.

ఈ ప్రయత్నం సోషల్ మీడియాలో విశేష సానుకూల స్పందన రావడంతో పాటు స్టేటస్ చూసిన స్నేహితులు, కుటుంబ సభ్యులతో పాటు వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ ప్రాముఖ్యతను గుర్తిస్తారని బాలానగర్ ఏసిపి నరేష్ రెడ్డి అన్నారు. పౌరుల ప్రాణ రక్షణ తమ ప్రధాన లక్ష్యమని, చలాన్ల కంటే చైతన్యం చాలా ప్రభావవంతమని ఈ కార్యక్రమం ద్వారా నిరూపితమైంది సీఐ మల్లేష్ అన్నారు. జీడిమెట్ల పోలీసులు చేపట్టిన ఈ వినూత్న చర్య ప్రజల్లో ట్రాఫిక్ నియమాల పట్ల అవగాహన పెంచడమే కాకుండా, పోలీసుల పట్ల నమ్మకం పెంచిందని స్థానికులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో జీడిమెట్ల పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.