పారిశుద్ధ్య విధుల్లోనే…చెత్తలో కాలిన శవమై…
~ జిహెచ్ఎంసి పారిశుద్ధ్య కార్మికుడి అనుమానాస్పద మృతి
~ కుత్బుల్లాపూర్ సర్కిల్లో ఘటన
~ శవ భాగాలను కుక్కలు పీక్కొని తిన్న వైనం
~ తరచూ మూర్చ వస్తుందని తెలిపిన సహచరులు
~ మరణం సహజమేనా..? లేక ఇతర కారణాలా..?
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), నవంబర్ 15: ప్రజల ఆరోగ్యం, పర్యావరణం కోసం శ్రమించే పారిశుద్ధ్య కార్మికుల పరిస్థితి మరోసారి హృదయ విదారకంగా మారింది. పారిశుద్ధ్య విధులు నిర్వహించే జిహెచ్ఎంసి ఔట్ సోర్సింగ్ కార్మికుడు పాముల ఆంజనేయులు మృతిచెందిన ఘటన కుత్బుల్లాపూర్ జిహెచ్ఎంసి సర్కిల్లో వెలుగుచూసి కలకలం రేపింది. ఈ ఘటన కుత్బుల్లాపూర్ గ్రామం నుంచి జిహెచ్ఎంసి సర్కిల్ కార్యాలయానికి వెళ్లే ప్రధాన రహదారి పక్కన ఉన్న నర్సరీ సమీపంలో చోటు చేసుకుంది. ముఖ్యంగా చెత్తలో కాలిన శవాన్ని కుక్కలు పీక్కొని తిన్నట్లు గుర్తించడంతో సహచరులు, స్థానికులను కలచి వేసింది.
• ఉదయం హాజరు… మధ్యాహ్నం విధుల ముగింపు…
సాధారణంగా శుక్రవారం ఉదయం విధులకు హాజరైన ఆంజనేయులు హాజరును సానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ (ఎస్ఎఫ్ఏ) నమోదు చేసుకున్నాడు. అలాగే మధ్యాహ్నం 2 గంటలకు విధులు ముగిసిన అనంతరం కూడా ఎస్ఎఫ్ఏ హాజరు నమోదు చేసుకోవాలి. కానీ… ఎస్ఎఫ్ఏ విధులు ముగిసిన అనంతరం హాజరూ నమోదు చేసుకోలేదు.
• తరచూ మూర్చ వస్తోందని సహచరుల సమాచారం…
ఆంజనేయులకు గత కొన్ని రోజులుగా తరచూ మూర్చ వచ్చే సమస్య ఉంటుందని కొందరు సహచరులు తెలిపారు. విధులు నిర్వహిస్తున్న పలు సందర్భాలలో మూర్చ వచ్చి పడిపోయి అనంతరం కొద్దిసేపటికి యధావిధిగా విధులు నిర్వహించేవాడని వారు తెలిపారు. విధుల్లో భాగంగా చెత్తను వేయడానికి వెళ్లి కాలుతున్న చెత్తలో మూర్చ వచ్చి పడిపోయి చనిపోయాడా..? లేక ఏవైనా ఇతర కారణాలు ఉన్నాయా…? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
• శనివారం ఉదయం దారుణ నిజం…
శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఆంజనేయులు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. వారు సమాచారం ఇవ్వడంతో సహచరులు శనివారం ఉదయం వెతకగా, నర్సరీ పక్కన చెత్తలో కాలిన శవంగా పడి ఉన్న ఆయనను గుర్తించారు. అప్పటికే శవ భాగాలను కుక్కలు పీక్కొని తిన్నట్లు గుర్తించిన దృశ్యాన్ని చూసిన సహచరులు, స్థానికులు తీవ్ర వేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అతడి మరణం సహజమేనా? లేక ఇతర కారణాల వలన జరిగిందా? అన్న అనుమానాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన కుత్బుల్లాపూర్ ప్రాంతంలో కలకలం రేపగా, పారిశుద్ధ్య కార్మికుల భద్రత, ఆరోగ్య పరీక్షలు, వర్క్ మానిటరింగ్ వ్యవస్థపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎస్ఎఫ్ఏల నిర్లక్ష్యం, అత్యల్ప సదుపాయాలతో ప్రజల కోసం కష్టపడే పారిశుద్ధ్య కార్మికుల భద్రతపై సంబంధిత అధికారులు దృష్టి సారించాలనే డిమాండ్ వినిపిస్తోంది.