పార్కు స్థలం కబ్జా… నిరసన… కూలిన అక్రమ నిర్మాణం

• రుక్మిణి ఎస్టేట్లోని ఓ పార్కు స్థలంలో ఓ వ్యక్తి ఆక్రమ నిర్మాణం

• సర్కిల్ కార్యాలయం వద్ద నిరసన తెలిపిన కాలనీ వాసులు

• హైడ్రాలో ఫిర్యాదు.. వెంటనే ఆక్రమ నిర్మాణం కూల్చివేత 

• ఆనందం వ్యక్తం చేసిన కాలనీ వాసులు

కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జూన్ 27: కుత్బుల్లాపూర్ సర్కిల్ జీడిమెట్ల డివిజన్ లోని హెచ్ఎండీఏ లేఅవుట్ పర్కిట్ సంఖ్య 4689 /ఎంపీ2/ హెచ్/2000, 5945/ ఎంపీ2/ హెచ్/2000 సర్వేనంబర్లు 218, 214/ఏలోని రుక్మిణి ఎస్టేట్ లో ఓ పార్కును ఓ వ్యక్తి ఆక్రమంగా ఆక్రమించుకొని చేపట్టిన నిర్మాణ పనులు మరోమారు వివాదాస్పదమయ్యాయి. గత మూడు సంవత్సరాల క్రితం కూడా సదరు స్థలంలో ఆక్రమంగా నిర్మాణాలు చేపట్టేందుకు పూనుకుంటే అప్పుడు అందిన ఫిర్యాదుల మేరకు సర్కిల్ అధికారులు పనులను నిలిపివేశారు. అప్పటి నుంచి ఆ స్థలంపై కన్నుపడ్డ ఆక్రమార్కులు దానిని ఆక్రమించుకొనేందుకు విశ్వ ప్రయత్నాలు చేసి తాజాగా గురువారం నిర్మాణ పనులకు మరోమారు పూనుకున్నారు. దీంతో కాలనీ వాసులు ఉప కమిషనర్ వి. నర్సింహకు ఫిర్యాదు చేయడంతో ఆయన స్థల పరిశీలన చేసి పనులను నిలిపివేయాలని ఆదేశించడంతో పనులను నిలిపివేశారు, ఆనంతరం అధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ సాయంత్రం మరల పనులను తిరిగి ప్రారంభించడంతో సిబ్బందిని పంపి మరోమారు పనులను అడ్డుకున్నారు.

సర్కిల్ కార్యాలయం ముందు నిరసన తెలుపుతున్న కాలనీవాసులు, బిజెపి నాయకులు

• సర్కిల్ కార్యాలయం ముందు నిరసన…

సదరు పార్కు స్థలాన్ని కాపాడాలని కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు, కాలనీ వాసులు బీజేపీ నాయకులతో కలిసి కుత్బుల్లాపూర్ సర్కిల్ కార్యాలయం వద్ద బైఠాయించి గురువారం నిరసన తెలిపారు. ఓ వ్యక్తి నకిలీ పత్రాలు సృష్టించి ఆక్రమంగా తమ పార్కు స్థలాన్ని కబ్జా చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని వారు ఆరోపించారు. హెచ్ఎండీఏ లేఅవుట్ లోని పార్కు స్థలాన్ని కూడా కాపాడలేని అధికారులు ఎందుకని, వెంటనే వారిని సస్పెండ్ చేయాలని, కబ్జాదారులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకొని ప్రజోపకారాలకు ఉపయోగపడే పార్కు స్థలాన్ని రక్షించాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం కార్యాలయంలో సంబంధిత అధికారులు ఎవరు లేకపోవడంతో ఫిర్యాదును కార్యాలయ గేటుకు కట్టారు. ఈ నిరసన కార్యాక్రమంలో కాలనీ సంక్షేమ సంఘ అధ్యక్షుడు అప్పుల శేఖర్, సభ్యులు నాగరాజు, రాజేశ్వర్, ప్రదీప్, నర్సింహులు, వీరబాబు, కుంట స్వామి, సంజీవరెడ్డి, బీజేపీ సినీయర్ నాయకులు ఆకుల సతీష్, బీజేపీ జీడిమెట్ల డివిజన్ మాజీ అధ్యక్షడు పులి బలరాం, బిజెపి మేడ్చల్ ఆర్బన్ జిల్లా అధికార ప్రతినిధి నల్ల జైశంకర్ గౌడ్, చందు పాల్గొన్నారు.

సిబ్బంది కూల్చేసిన అక్రమ నిర్మాణం

• హైడ్రాలో ఫిర్యాదు… వెంటనే పరిష్కారం…

అక్కడి నుంచి కాలనీ సంక్షేమ సంఘ సభ్యులు, బీజేపీ నాయకులు నేరుగా హైడ్రా కార్యాలయానికి చేరుకొని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. వినతి పత్రం అందుకున్న ఆయన తక్షణమే స్పందించి జీహెచ్ఎంసీ కూకట్పల్లి జోనల్ కమిషనర్ తో ఫోన్లో మాట్లాడి సదరు విషయంపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశిందారు. దీంతో కాలనీ వాసులు వినతి పత్రం అందజేసి కాలనీకి వచ్చేలోపే పార్కులో ఆక్రమంగా నిర్మించిన నిర్మాణాన్ని సిబ్బంది నేలమట్టం చేశారు. దీంతో కాలనీ వాసులు ఆనందాన్ని వ్యక్తం చేసి హైడ్రా తీరును ప్రశంసిస్తూ కమిషనర్ రంగనాథ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More