ప్రభుత్వ స్థలంలో దర్జాగా అక్రమ నీటి దందా
– గాజులరామారం సర్వేనెంబర్ 345 ప్రభుత్వ స్థలంలో బాగోతం
– దర్జాగా పాగా… సంవత్సరాలుగా భూగర్భ జలాల దోపిడీ
– చర్యలు తీసుకోవాలని కుత్బుల్లాపూర్ ఎమ్మార్వో కార్యాలయంలో ఫిర్యాదు
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), ఆగస్టు 4: ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించడమే కాకుండా దర్జాగా భూగర్భ జలాలను దోచుకుంటూ దందా చేస్తూ కొందరు వ్యక్తులు జేబులు నింపుకుంటున్నారు. కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారం సర్వేనెంబర్ 345 ప్రభుత్వ భూమిలో గత కొన్ని సంవత్సరాలుగా అక్రమ నీటి వ్యాపారం నిర్విరామంగా కొనసాగుతుంది. ఈ విషయంపై కుత్బుల్లాపూర్ మండల కార్యాలయంలో సోమవారం ఫిర్యాదు చేశారు.
• డబుల్ బెడ్ రూమ్ ప్రాంగణం వెనకాలే…
గాజులరామారం కైసర్ నగర్ సర్వే నెంబరు 345 లో మొత్తం 9 ఎకరాల 7 గుంతల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో సుమారు నాలుగున్నర ఎకరాల విస్తీర్ణంలో డబుల్ బెడ్ రూమ్ గృహ సముదాయాలను ప్రభుత్వం నిర్మించింది. మిగిలిన మరికొంత స్థలంలో రోడ్డు, స్మశాన వాటిక తదితర వాటికి పోగా ఇంకా ఎక్కువ మొత్తంలో ప్రభుత్వ భూమి ఖాళీగా ఉంది. ప్రస్తుతం సదరు ప్రభుత్వ ఖాళీ స్థలంలో ఓ వ్యక్తి గత కొన్ని సంవత్సరాలుగా వాల్టా చట్టానికి విరుద్ధంగా అక్రమ బోరు బావులను ఏర్పాటు చేసి నీటి దందాను యదేచ్చగా కొనసాగిస్తున్నాడు. బోరు బావులు ఇతర తాత్కాలిక కట్టడాలు మొత్తం కలిపి సుమారు 7,000 గజాలకు పైగా ప్రభుత్వ స్థలంలో కబ్జా ఉన్నట్లు తెలుస్తోంది.

• ప్రభుత్వ భూమికి ఆనుకొని ఉన్న…
సర్వేనెంబర్ 345 లో 9 ఎకరాల 7 గుంటల ప్రభుత్వ భూమి ఆనుకొని సర్వేనెంబర్ 342 లో 378.22 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ రెండిటికి అనుకొని ఉన్న సర్వేనెంబర్ 344 లో 15 ఎకరాల 27 గుంటల ప్రైవేటు పట్టా భూమి ఉంది. ఇది డబుల్ బెడ్ రూమ్ ప్రాంగణానికి వెనకవైపు ఉన్న ప్రభుత్వ భూమికి ఆనుకొని ఉండడాన్ని అదునుగా చేసుకొని సర్వేనెంబర్ 345లో ప్రభుత్వ భూమిని దర్జాగా కబ్జా చేశారని ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా సదరు ప్రభుత్వ స్థలంలో సుమారు 5 బోరు బావులను ఏర్పాటు చేసి ఏళ్ల తరబడి భూగర్భ జలాలను దోచేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
• బహిరంగ జలదోపిడి చేస్తున్న…
కుత్బుల్లాపూర్ తహసిల్దార్ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే ప్రభుత్వ భూమిలో బహిరంగంగా జల దోపిడి చేస్తున్న రెవెన్యూ అధికారుల దృష్టిలో లేకుండా పోయిందా…? లేక అధికారులకు తెలిసిన దృష్టి సారించలేదా…? అనే అనుమానాలను వారు వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు పదుల సంఖ్యలో ట్యాంకర్లను నింపుతూ నీటిని విక్రయిస్తూ అక్రమంగా అర్జిస్తున్న తీరు సంబంధిత అధికారులకు తెలియకుండానే జరుగుతుందా..? అనే కోణంలో కూడా ఆరోపణలు ఉన్నాయి. వెంటనే రెవిన్యూ అధికారులు స్పందించి సర్వేనెంబర్ 345 లో ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని రక్షించి అక్కడ జరుగుతున్న జల దోపిడికి చెక్ పెట్టాలని స్థానికులు కోరుతున్నారు.