బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన వారిపై పోలీసుల దాడి
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), అక్టోబర్ 14: నేరాలు నియంత్రణలో భాగంగా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ శాంతి భద్రతకు భంగం కలిగించే వారిపై పోలీసులు కొరడా జులిపించారు. జీడిమెట్ల డిఐ ధనుంజయ ఆధ్వర్యంలో ఎస్సై శ్యాంబాబు సిబ్బందితో కలిసి మంగళవారం రాత్రి కుత్బుల్లాపూర్ గ్రామంలో పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ప్రధానంగా మద్యం దుకాణాలకు సమీపంలోని బహిరంగ, నిర్మానుష్య ప్రాంతాలతో పాటు రహదారులకు పక్కన, కాలనీ వీధుల్లో మద్యం సేవిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తామని పోలీసులు తెలిపారు. మద్యం సేవించాలనుకునే వారు అనుమతులు ఉన్న ప్రదేశాల్లోనే సేవించాలని, ప్రజా ప్రదేశాల్లో సేవిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శాంతి భద్రత కోసం ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగనున్నట్లు అధికారులు తెలిపారు.

• వాహనాలను తనిఖీ చేసిన పోలీసులు…
జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని షాపూర్ నగర్ లోని ఈఎస్ఐ హాస్పిటల్ కూడలిలో జీడిమెట్ల సీఐ గడ్డం మల్లేష్ ఆధ్వర్యంలో ఎస్సైలు నాయుడు, సురేష్ గౌడ్ ఇబ్బందితో కలిసి భారీ స్థాయిలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఇటీవల ప్రాంతంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, చోరీలు, అనుమానాస్పద రవాణా చర్యల నేపథ్యంలో ప్రజల భద్రత దృష్ట్యా ఈ ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో సుమారు 125 వాహనాలను నిశితంగా పరిశీలించారు. డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ పత్రాలు, ఇన్సూరెన్స్ వివరాలు సరిచూశారు. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడిపినవారికి జరిమానాలు విధించగా, మద్యం సేవించి వాహనం నడిపిన కొందరిపై కేసులు నమోదు చేశారు.
అలాగే రాత్రివేళల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వాహనాలను ఆపి డ్రైవర్ల వివరాలు నమోదు చేశారు. కొంతమంది యువకులు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించడంతో, వారికి కౌన్సిలింగ్ ఇచ్చి, వాహనాలను తాత్కాలికంగా స్వాధీనం చేసుకున్నారు.

ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, హెల్మెట్ ధరించడం తమ ప్రాణ రక్షణకై అత్యవసరమని వారు సూచించారు. ప్రజల సహకారంతో రోడ్డు ప్రమాదాలు, చోరీలు, చట్టవ్యతిరేక చర్యలను అరికట్టగలమని పోలీసులు తెలిపారు.