బాపునగర్ సంక్షేమ సంఘ ఎన్నికల నామినేషన్లు దాఖలు
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), ఏప్రిల్ 26: సాధారణ ఎన్నికలను తలపించేలా బాపునగర్ సంక్షేమ సంఘం ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. జీడిమెట్ల సర్కిల్ పరిధి బాపునగర్ లో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు సేవలందిస్తున్న బాపునగర్ సంక్షేమ సంఘ ఎన్నికల ప్రక్రియలో భాగంగా పలువురు ఆదివారం నామినేషన్లు దాఖలు చేశారు. సంక్షేమ సంఘం అధ్యక్ష పదవికి పి. జగదీశ్వర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి పదవికి సిహెచ్. దయానంద్ తమ నామినేషన్లు సమర్పించారు.
ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు, ప్రాంతీయ నాయకులు పెద్ద ఎత్తున హాజరై అభ్యర్థులకు మద్దతు తెలిపారు. అభ్యర్థులు మాట్లాడుతూ.. బాపునగర్ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, మౌలిక వసతుల మెరుగుదల కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అసోసియేషన్ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో సభ్యుల్లో ఉత్సాహం నెలకొంది. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించబడుతుందని ఎన్నికల నిర్వాహకులు తెలిపారు. బాపునగర్ ప్రాంత ప్రజల సంక్షేమం, అభివృద్ధి దిశగా ఈ ఎన్నికలు కీలకంగా మారనున్నాయి.