కుత్బుల్లాపూర్‌లో సర్ ప్రక్రియ వేగవంతానికి రాజకీయ పార్టీల సహకరించాలి: ఈఆర్వో పింకేష్ కుమార్
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), ఏప్రిల్ 27:
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సీవ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను సజావుగా, వేగవంతంగా పూర్తి చేయడానికి రాజకీయ పార్టీలు పూర్తి సహకారం అందించాలని కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్, ఈఆర్వో పింకేష్ కుమార్ తెలిపారు. ఈనెల 17వ తేదీన ఈఆర్వోగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సర్ ఎన్నికల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలంటే ప్రతి రాజకీయ పార్టీ తమ బూత్ స్థాయి ఏజెంట్లను (బిఎల్ఏలు) నియమించి, బూత్ స్థాయి అధికారులకు (బిఎల్ఓలు) సహకరించాలని సూచించారు. పక్క రాష్ట్రాల్లో సర్ ప్రక్రియ వేగంగా పూర్తవుతున్న నేపథ్యంలో, అదే స్థాయిలో కుత్బుల్లాపూర్‌లో కూడా పూర్తి చేయడానికి రాజకీయ పార్టీలు చురుకుగా వ్యవహరించాలని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే అధికారులు బస్తీలు, కాలనీల సంక్షేమ సంఘాల నాయకులతో కలిసి పలు ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బిఎల్ఓలు ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహిస్తూ, ఓటర్లకు ఉన్న అభ్యంతరాలను నివృత్తి చేస్తున్నారని వివరించారు. సర్ ప్రక్రియపై ప్రజలతో పాటు ముఖ్యంగా రాజకీయ నాయకులు, ప్రతినిధులకు సరైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని బిఆర్ఎస్ పార్టీ ప్రతినిధి సత్యనారాయణ పేర్కొన్నారు. చాలామందికి సరైన సమాచారం లేకపోవడం వల్ల అనవసర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయని, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తే కార్యకర్తలు, ప్రజలకు స్పష్టత ఇవ్వగలరని సూచించారు. దీనిపై స్పందించిన ఈఆర్వో పింకేష్ కుమార్ త్వరలోనే ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఎన్నికల డిటి అబ్దుల్ రెహమాన్, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు రాజు, శ్రీనివాస్ రెడ్డి, బిజెపి ప్రతినిధులు పులి బలరాం, కోడి ఆదిత్య, బిఆర్ఎస్ ప్రతినిధి సత్యనారాయణ, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.
• కుత్బుల్లాపూర్‌లో 42 శాతం మ్యాపింగ్ పూర్తి…
స్పెషల్ ఇంటెన్సీవ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)లో భాగంగా మే 5వ తేదీ నాటికి 80 శాతం మ్యాపింగ్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో 42 శాతం మ్యాపింగ్ పూర్తయింది. మొత్తం ఓటర్ల సంఖ్య 7,48,729 కాగా, వీరిలో 40 ఏళ్ల పైబడిన ఓటర్లు 4,08,218 మంది ఉన్నారు. వారిలో 1,68,272 మందిని ఇప్పటికే మ్యాపింగ్ చేశారు. అలాగే 40 ఏళ్ల లోపు 3,40,511 మంది ఓటర్లలో 93,408 మందిని కుటుంబ సభ్యులతో (ప్రోజెనీ) కలిపి మ్యాపింగ్ చేశారు.
• రాజకీయ పార్టీల అనాశక్తి..
అయితే ఎన్నికల ప్రక్రియ, ఓటర్ జాబితా సవరణ, సర్ వంటి కార్యక్రమాలపై నిర్వహించే సమావేశాలకు రాజకీయ పార్టీలు అనాశక్తి చూపుతున్నాయి. పలువురు పార్టీల ప్రతినిధులు సమావేశాలకు గైర్హాజరవుతున్నారు. మరోవైపు అధికారులు తమ సూచనలు, అభ్యంతరాలను పట్టించుకోవడం లేదనే అభిప్రాయం కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పరస్పర సమన్వయం పెరిగితేనే ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియలను సజావుగా, పారదర్శకంగా నిర్వహించే అవకాశం ఉంటుంది.