అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సుచిత్రలో ఉచిత యోగా శిబిరం
పేట్‌బషీరాబాద్, (న్యూస్ విధాత్రి), జూన్ 16: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 21వ తేదీన సుచిత్ర కూడలి వద్ద ఉచిత యోగా శిబిరాన్ని నిర్వహించనున్నట్లు యోగా గురూజీ కె. రవీందర్ రాజు తెలిపారు. శివోహం యోగా రీసెర్చ్ సెంటర్ ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయబడుతోంది. జూన్ 21న ఉదయం 5:30 గంటల నుంచి 7:30 గంటల వరకు నిర్వహించే ఈ యోగా శిబిరంలో వివిధ యోగా ఆసనాలు, ప్రాణాయామం, ధ్యాన విధానాలపై అవగాహన కల్పించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత కాలంలో ఆరోగ్య పరిరక్షణకు యోగా ఎంతో అవసరమని, శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. పరిసర ప్రాంతాల ప్రజలు, యువత, మహిళలు, యోగా అభిలాషులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.