కుత్బుల్లాపూర్ జోన్లో గార్బేజ్ వల్నరబుల్ పాయింట్ల నిర్మూలన
• ప్రజా పాలన 99 రోజుల కార్యక్రమానికి విశేష స్పందన..
• పారిశుద్ధ్య సిబ్బందిపై ప్రశంసల వెల్లువ
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జూన్ 16: ప్రజా పాలన 99 రోజుల ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా కుత్బుల్లాపూర్ జోన్ పరిధిలో గార్బేజ్ వల్నరబుల్ పాయింట్ల (జీవీపీలు) నిర్మూలనకు చేపట్టిన ప్రత్యేక చర్యలు విజయవంతమయ్యాయి. జోన్ పరిధిలోని వివిధ సర్కిళ్లలో అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది, భాగస్వామ్య సంస్థల సమన్వయంతో నిర్వహించిన కార్యక్రమం ద్వారా వీధుల్లో చెత్త పేరుకుపోయే ప్రాంతాలను పూర్తిగా తొలగించి పరిశుభ్రమైన వాతావరణాన్ని నెలకొల్పారు. అధికారులు ముందుగా చెత్త పేరుకుపోతున్న ప్రాంతాలను గుర్తించి, అక్కడ శాస్త్రీయ ఘన వ్యర్థాల నిర్వహణ విధానాలను అమలు చేశారు. ఇంటింటి చెత్త సేకరణను 100 శాతం నిర్ధారించడంతో పాటు రోడ్ల ఊడ్చివేత ద్వారా సేకరించిన వ్యర్థాలను సమీప సేకరణ కేంద్రాలకు తరలించారు. ఈ చర్యల ఫలితంగా గార్బేజ్ వల్నరబుల్ పాయింట్లు పూర్తిగా నిర్మూలించబడినట్లు అధికారులు తెలిపారు.

నిర్మూలించబడిన ప్రాంతాల్లో పారిశుద్ధ్య సిబ్బంది ప్రత్యేకంగా పూలు, రంగవల్లులతో అలంకరణలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉప కమిషనర్లు, ర్యాంకీ సంస్థ సీనియర్ ప్రతినిధులు, పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు. పరిసర ప్రాంతాల నివాసితులు కార్యక్రమాన్ని అభినందిస్తూ పారిశుద్ధ్య కార్మికుల సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్ పింకేష్ కుమార్ లలిత్‌కుమార్ మాట్లాడుతూ… ప్రజలు రోడ్లపై చెత్త వేయకుండా స్వచ్ఛ ఆటోలకు మాత్రమే చెత్తను అందజేయాలని కోరారు. అలాగే నూతన ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు–2026 ప్రకారం అన్ని బల్క్ వేస్ట్ జనరేటర్లు (బిడబ్ల్యుజిఎస్) తప్పనిసరిగా సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (సిపిసిబి) పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రజల సహకారం, పారిశుద్ధ్య సిబ్బంది అంకితభావం, సమర్థవంతమైన వ్యర్థాల నిర్వహణ చర్యలతో రోడ్లపై బహిరంగ చెత్త పారవేత పూర్తిగా నిర్మూలించబడటమే కాకుండా పారిశుద్ధ్య సేవల నాణ్యత మరింత మెరుగుపడుతుందని జోనల్ కమిషనర్ ఆశాభావం వ్యక్తం చేశారు.