గాజులరామారం సర్వే నెం.79లో ప్రభుత్వ భూమి కబ్జాపై ఉక్కుపాదం
• కేసు నమోదైన డోంట్ కేర్
• బండరాయితో బెదిరింపులకు పాల్పడిన ఫిరోజ్ ఖాన్
• కూల్చడానికి వచ్చిన ప్రోక్లైనర్ పై రాళ్లతో దాడి చేసిన కుటుంబ సభ్యులు
• స్పృహ కోల్పోయిన ఫిరోజ్ ఖాన్… ఆసుపత్రికి తరలింపు
• పోలీస్ బందోబస్తుతో కూల్చివేతలు చేసిన రెవెన్యూ అధికారులు
• హైడ్రామా మధ్య ప్రహరీ గోడ, పునాదుల తొలగింపు
గాజులరామారం (న్యూస్ విధాత్రి), జూన్ 15: ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి దర్జాగా నిర్మాణాలు చేపట్టడమే కాకుండా పోలీసు కేసులైన డోంట్ కేర్ అంటూ అధికారులకు సవాళ్లు విసురుతున్నారు కొందరు కబ్జాదారులు. ఈ నేపథ్యంలో గాజులరామారం పరిధిలోని సర్వే నంబర్ 79లో ప్రభుత్వ భూమి ఆక్రమణ వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రెవెన్యూ శాఖ అధికారులు, పోలీసుల భారీ బందోబస్తు మధ్య ఆక్రమిత నిర్మాణాలను కూల్చివేసే చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ప్రభుత్వ భూమిగా నమోదైన స్థలంలో ఫిరోజ్ ఖాన్ అక్రమంగా ప్రహరీ గోడతో పాటు నిర్మాణాలకు సంబంధించిన పునాదులు ఏర్పాటు చేసినట్లు గుర్తించారు.

ఇప్పటికే పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ స్పందన లేకపోవడంతో ఈనెల 12వ తేదీన కుత్బుల్లాపూర్ రెవెన్యూ అధికారులు జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. అయినప్పటికీ అవేమీ తమకు పట్టవన్నట్లు వ్యవహరిస్తుండడంతో అధికారులు కూల్చివేత చర్యలకు సోమవారం సిద్ధమయ్యారు.

ఈ మేరకు కూల్చివేతల కోసం ప్రొక్లైనర్ యంత్రం అక్కడికి చేరుకున్న సమయంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అధికారులు ఎంత వారించినా వినకుండా ఫిరోజ్ ఖాన్ బండరాయి చేత పట్టుకుని ప్రోక్లైనర్ డ్రైవర్ తో పాటు అధికారులను బెదిరించేందుకు ప్రయత్నించగా, కుటుంబ సభ్యులు కూడా కూల్చివేతలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ప్రొక్లైనర్ యంత్రంపై రాళ్లు ఉసిరి గందరగోళ పరిస్థితిని సృష్టించారు. పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఉండటంతో పోలీసులు రంగంలోకి దిగి అక్కడున్న వారిని నియంత్రించారు.

ఈ హైడ్రామా మధ్య ఫిరోజ్ ఖాన్ ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోవడంతో వెంటనే అక్కడున్న వారి సహాయంతో ఆస్పత్రికి తరలించారు. దీంతో కొంతసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే రెవెన్యూ అధికారులు వెనక్కి తగ్గకుండా తమ చర్యలను కొనసాగించారు. పోలీసుల రక్షణ నడుమ ప్రహరీ గోడతో పాటు పునాదులను పూర్తిగా తొలగించారు. కూల్చివేత ప్రక్రియ ముగిసే వరకు జీడిమెట్ల ఎస్ఐలు ప్రేమ్ సాగర్, శ్రీనివాసులు సమక్షంలో సిబ్బందితో భారీ పోలీస్ బందోబస్తు కొనసాగింది.
• ప్రభుత్వ స్థలం కబ్జా చేస్తే సహించేది లేదు. – ఖలీం, రెవెన్యూ ఇన్స్పెక్టర్
ప్రభుత్వ భూములను ఎవరైనా ఆక్రమిస్తే సహించేది లేదు. ఎంతటి వారైనా ఉపేక్షించం. మా అధికారిక రికార్డుల ప్రకారం ఈ స్థలం ప్రభుత్వానికి చెందినదే. ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఆర్ఐ ఖలీం స్పష్టం చేశారు.